
నరసింహన్‌తో ఒరిగిందేమీ లేదు
కేంద్ర హోం మంత్రికి వీహెచ్ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: గవర్నర్ నరసింహన్ వల్ల గత ఏడేళ్లలో తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదని, ఆయన పదవీ కాలం పొడిగింపును పునఃసమీక్షించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శనివారం లేఖ రాశారు. బాధ్యతాయుతమైన గవర్నర్ పదవిలో ఉన్న నరసింహన్ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది పోయి.. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పాల్ప డుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలకు వంతపాడుతున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు.
నరసింహన్ పదవీ కాలాన్ని పొడిగిస్తే ఏపీ, తెలంగాణలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఏపీలో టీడీపీ ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నా గవర్నర్ చర్యలు తీసుకోకపోగా.. పార్టీ ఫిరాయించిన వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు విస్మరించిందని, రైతుల సమస్యలను పట్టించుకోవట్లేదని, మద్దతు ధర లేక ఆందోళన చేపట్టిన మిర్చి రైతులను గూండాలుగా చిత్రీకరించి జైల్లో పెడుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నా గవర్నర్ చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ఆలయాలు సందర్శించడానికే గవర్నర్ సమయం కేటాయిస్తున్నారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవ డం లేదన్నారు. కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారన్నారు. ఆయన పదవీ కాలం పొడిగింపును సమీక్షించి.. కొత్త గవర్నర్‌ను నియమించాలని కోరారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లందరినీ వెనక్కి పిలిచి.. నరసింహన్‌ను ఎందుకు కొనసాగిస్తున్నారని వీహెచ్ ప్రశ్నించారు.