'సెటిలర్లపై టీఆర్ఎస్ కపట ప్రేమ ఒలకబోస్తుంది'
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల కోసమే సెటిలర్లపై టీఆర్ఎస్ కపట ప్రేమ ఒలకబోస్తుందని ఆరోపించారు. సీమాంధ్రలో పోటీకి సిద్ధమంటూ మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
ఓట్ల కోసమే టీఆర్ఎస్ పార్టీ పేరును తెలుగు రాష్ట్ర సమితి అని చెప్పుకుంటున్నారని వీహెచ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాకముందు సీమాంధ్రులను రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన టీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలను ఈ సందర్బంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని వీహెచ్ వెల్లడించారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాక సెటిలర్లను టీఆర్ఎస్ ఇబ్బందులకు గురి చేస్తుందని వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు.