టీఎల్‌ఎఫ్ నుంచి వెంకటస్వామి తొలగింపు
హైదరాబాద్: తెలంగాణ లెక్చరర్స్ ఫోరం(టీఎల్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామిని ఫోరం నుంచి తొలగించారు. ఆదివారం ఇక్కడ జరిగిన టీఎల్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ ఈ మేరకు తీర్మానం చేసింది. ఉద్యోగం వదులుకొని రాజకీయాల్లో ఉంటున్న కారణంగా వెంకటస్వామి ఫోరం సభ్యత్వానికి అర్హుడు కాదంటూ పేర్కొంది. వెంకటస్వామి స్థానంలో నూతన అధ్యక్షుడిగా మురళీమనోహర్ ఎన్నికయ్యారు. మిగతా పాత కమిటీ యథాతథంగా కొనసాగుతుందని మురళీమనోహర్ చెప్పారు. ప్రైవేటు కళాశాలల లెక్చరర్ల ఉద్యోగ భద్రతకై ప్రత్యేక కార్యాచరణను తీసుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో లెక్చరర్లపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ, 10 ప్లస్ 2 విద్యా విధానంపై ప్రత్యేక సబ్ కమిటీ వేస్తామని, కమిటీ నివేదిక అనంతరం ఈ సమస్యలపై స్పందిస్తామని చెప్పారు.