
చంపడానికే హోంమంత్రి ఉన్నాడా?: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: రెచ్చిపోతే చచ్చిపోతారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హెచ్చరిస్తున్నారని, ప్రజలను చంపడానికే హోంమంత్రిగా ఉన్నాడా అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. మంగళ వారంనాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ధర్నా లేదు, ధర్మం లేదు అన్నట్టుగా ఉందని ఆరోపించారు.
ధర్నాచౌక్ ఇందిరాపార్కు వద్దే ఉండాలని పోరాడుతున్నవారికి, వద్దంటున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసులను ప్రభుత్వమే రెచ్చగొట్టి అదే సమయానికి ధర్నాకు అనుమతినిచ్చిందని తెలిపారు. రైతుల సమస్యలు, ధర్నాచౌక్ పోరాటాల గురించి పట్టించుకునే తీరిక గవర్నర్‌కు లేకుండా పోయిందని విమర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఉగ్రవాదులా అనే పోస్టర్‌ను విడుదల చేశారు.