పార్శీగుట్ట... సమస్యల పుట్ట
‘స్వచ్ఛ హైదరాబాద్’ ఇన్‌చార్జిగా సీఎం
{పజల్లో చిగురిస్తున్న ఆశలు
మేఘాలు చూస్తే అక్కడి ప్రజలకు భయం. చినుకును చూస్తే వణుకు. ఎప్పుడెప్పుడు జనావాసాల పైకి దండెత్తుదామా అన్నట్టుగా ఎదురు చూసే నాలా... దశాబ్దాలుగా జనాలకు నరకం చూపిస్తోంది. మంచినీటి పైపులైన్లతో కలసి కలుషిత జలాలు ప్రజల గొంతులో దిగే ప్రయత్నం చేస్తుంటాయి. వ్యాధులను మోసుకొస్తుంటాయి. చెరువులను తలపించే రహదారులు... ఎక్కడికక్కడే గుట్టల్లా చెత్త కుప్పలు..ఇదీ సికింద్రాబాద్ నియోజకవర్గం.. బౌద్ధనగర్ డివిజన్‌లోని పార్శీగుట్ట. ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ స్వయంగా ఆ ప్రాంత బాధ్యతలు చేపడుతున్నారు. ‘పార్శీగుట్ట’ రూపు రేఖలు మార్చేందుకు సిద్ధమవుతున్నారు.ఇది స్థానికుల్లో కోటి ఆశలను రేకెత్తిస్తోంది.
సికింద్రాబాద్: హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీని అమలుకు ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రముఖుడు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన బౌద్ధ నగర్ డివిజన్‌లో మరింత సమస్యాత్మకమైనది పార్శిగుట్ట యూనిట్. పారిశుద్ధ్యం మొదలు తాగునీరు వరకు అన్ని రకాల సమస్యలకు ఇది నిలయం. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండడంతో బౌద్ధనగర్ ప్రాధాన్యం సంతరించుకుంది. చిన్నపాటి చినుకులకే ముంపునకు గురయ్యే ఈ ప్రాంత ప్రజల్లో ‘స్వచ్ఛ హైదరాబాద్’కార్యక్రమం కొత్త ఆశలు నింపుతోంది. ముఖ్యమంత్రి చొరవతో తమ ప్రాంతానికి దీర్ఘకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్‌ను ‘స్వచ్ఛ హైదరాబాద్’ కోసం 31 యూనిట్లుగా విభజించారు. ఇందులో పార్శిగుట్ట 24వ యూనిట్.
ఇదీ టీమ్
పార్శిగుట్ట యూనిట్ స్వచ్ఛ హైదారాబాద్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్‌చార్జి. మెంటర్‌గా ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రియాంక, నోడల్ అధికారిగా జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ అసిస్టెంట్ ఇంజినీర్ కార్తీక్, పర్యవేక్షకుడిగా బిల్‌కలెక్టర్ నర్సింగరావు వ్యవహరించనున్నారు.
ప్రధాన సమస్యలు
వరద ముంపు వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నాలా నీరు ఇక్కడి ఇళ్లను ముంచెత్తుతోంది. న్యూఅశోక్‌నగర్, పుల్లయ్యబావి, మహ్మద్‌గూడ పరిసర ప్రాంతాలు పూర్తిగా నీట మునుగుతాయి.
కలుషిత జలాలు సరఫరా
నాలా పరీవాహక ప్రాంతాల్లోని జనావాసాలకు ఇప్పటికీ కలుషిత నీరే సరఫరా అవుతోంది. నాలాల్లోంచేతాగునీటి పైప్‌లైన్లు ఉన్నాయి. దశాబ్దాల క్రితం వేసిన పైప్‌లైన్లు దెబ్బతినడంతో స్థానికులకు కష్టాలు తప్పడం లేదు.
రహదారులు అధ్వానం
పార్శిగుట్ట యూనిట్‌లో రహదారులు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి. అసలే ఇరుకుగా, గుంతలతో ఉన్న రహదారులు నిత్యం మురుగు నీటితో నిండి ఉంటాయి. ఆ నీటిలో నుంచే రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
ఎక్కడికక్కడ చెత్తకుప్పలు
ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా భారీగా చెత్త కుప్పలు... నిండుగా ఉండే చెత్త కుండీలు దర్శనమిస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు తొలగించాల్సిన పారిశుద్ధ్య సిబ్బంది సరిగా పట్టించుకునే దాఖలాలు కనిపించవు.
పరిస్థితిని అధ్యయనం చేసేందుకే..
ఇక్కడి అస్తవ్యస్త పరిస్థితులను దగ్గరి నుంచి సమీక్షించేందుకే ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పార్శిగుట్టను ఎంచుకున్నారు. సీఎం వస్తున్నారని ఆర్భాటాలు చేసి... సమస్యలు కప్పిపుచ్చే ప్రయత్నం చెయ్యొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించాం. ముఖ్యమంత్రి పర్యటనతో ఈ ప్రాంతంలో సమూల మార్పులు జరిగే అవకాశం ఉంది.
- పద్మారావుగౌడ్, మంత్రి
ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ఫలితంగా అక్కడి రూపురేఖలు మారిపోతుంటాయి. మా ప్రాంతానికి వస్తారని తెలిసి ఇక్కడి ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశిస్తున్నాం. -కేఎం.శివలింగం, ఉపాధ్యక్షుడు, పార్శిగుట్ట సంక్షేమ సంఘం.
ముఖ్యమంత్రి యూనిట్ ప్రాంతాలివీ...
పార్శిగుట్ట నుంచి జామై ఉస్మానియా వరకు 3 కిలోమీటర్ల మేరకు ప్రధాన రహదారి విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్ని పార్శిగుట్ట యూనిట్‌గా జీహెచ్‌ఎంసీ అధికారులు విభజించారు. ఇందులో పార్శిగుట్ట, న్యూ అశోక్‌నగర్, అంబర్‌నగర్, అంబానగర్, అల్లాడి రాజ్‌కుమార్ నగర్, ఈశ్వరీబాయినగర్, సంజయ్‌గాంధీ నగర్, బౌద్ధనగర్, జామై ఉస్మానియా ప్రాంతాలు ఉన్నాయి. తొమ్మిది మురికివాడలు కలిగిన ఈ యూనిట్ జనాభా 22 వే లు.