బసవతారకం ఆస్పత్రికి రూ.5.72 కోట్లు మాఫీ | Waiver of Rs .5.72 crore Basava tarakam Hospital! | Sakshi
Sakshi News home page

బసవతారకం ఆస్పత్రికి రూ.5.72 కోట్లు మాఫీ

Published Fri, Mar 4 2016 1:42 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

బసవతారకం ఆస్పత్రికి రూ.5.72 కోట్లు మాఫీ - Sakshi

బసవతారకం ఆస్పత్రికి రూ.5.72 కోట్లు మాఫీ

సాక్షి, హైదరాబాద్: సినీనటుడు, ఏపీ టీడీపీ ముఖ్యనేత నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో అంతర్భాగంగా నిర్మించిన ఓ అక్రమ భవనం క్రమబద్ధీకరణ కోసం చెల్లించాల్సిన రూ.5.72 కోట్లకు మినహాయింపు ఇచ్చింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేన్సర్ రోగులకు వైద్యసేవలు అందిస్తున్నామన్న ఆస్పత్రి యాజమాన్యం విజ్ఞప్తిని ‘ప్రత్యేక కేసు’ కింద పరిగణిస్తూ ఈ మినహాయింపు ఇస్తూ... పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి గోపాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ కేన్సర్ ఫౌండేషన్ ట్రస్ట్, అమెరికాకు చెందిన ఇండో-అమెరికన్ కేన్సర్ ఆర్గనైజేషన్ సంయుక్త నిర్వహణలోని ఈ ఆస్పత్రి లాభాపేక్ష లేని పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌గా హైదరాబాద్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1 కార్యాలయంలో నమోదైంది. భవనాల క్రమబద్ధీకరణ కోసం 2008లో నాటి ప్రభుత్వం బీపీఎస్‌ను ప్రవేశపెట్టగా... ఈ ఆస్పత్రి ఆవరణలో నిర్మించిన ఓ అనధికార కట్టడాన్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.

దరఖాస్తుతో పాటు చెల్లించిన రూ.లక్ష పోగా రూ.5.72 కోట్లను క్రమబద్ధీకరణ కోసం చెల్లించాలని అప్పట్లో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరింది. అయితే ఈ చార్జీలను మినహాయించాలని ఆస్పత్రి యాజమాన్యం 2011 అక్టోబర్ 12న ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇటీవల ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ సీఎం కేసీఆర్‌ను కలసి చార్జీలను మినహాయించాలని, పెండింగ్ బీపీఎస్ దరఖాస్తును పరిష్కరించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నేతృత్వంలోని అధ్యయన కమిటీ  ఆస్పత్రిని సందర్శిం చి... అక్కడి వైద్యసేవలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా క్రమబద్ధీకరణ చార్జీలను ప్రభుత్వం మినహాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement