
కృష్ణమ్మ.. వచ్చిందమ్మా
- బుధవారం సాయంత్రానికల్లా 7 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
- ఆయకట్టుకు కాలువల ద్వారా నీటి విడుదల
సాక్షి, హైదరాబాద్/జూరాల : కృష్ణమ్మ వచ్చేసింది. కర్ణాటక నుంచి బిరబిర పరుగులు పెడుతూ బుధవారం పాలమూరు జిల్లాలోని జూరాలను చేరింది. ఇప్పటిదాకా కేవలం 3.58 టీఎంసీల నీటి నిల్వతో ఉన్న ఈ రిజర్వాయర్‌కు ఎగువ నుంచి వరద వస్తుండటంతో సాయంత్రానికల్లా నీటి నిల్వ 7 టీఎంసీలకు చేరింది. రాత్రిలోగా పూర్తిస్థాయి నీటిమట్టం 9.65 టీఎంసీలకు చేరనుండటంతో ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. జూరాలకు మధ్యాహ్నం 12 గంటలకు లక్ష క్యూసెక్కులతో మొదలైన ఇన్‌ఫ్లో సాయంత్రం 6 గంటలకల్లా 90 వేల క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
గుడ్డెందొడ్డి మొదటి పంప్‌హౌస్‌లో రెండు పంపులను ప్రారంభించి 750 క్యూసెక్కులను నె ట్టెంపాడు రెండో పంప్‌హౌస్‌కు పంపుతున్నారు. సోమవారం సాయంత్రం కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు క్రస్టుగేట్లను తెరవడంతో కృష్ణా వరద రాష్ట్రం వైపు పరుగులు పెట్టింది. ఎగువ నుంచి మొత్తం 1.37 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. అయితే బుధవారం వరద ఉధృతి తగ్గడంతో కర్ణాటక అధికారులు నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లన్నింటినీ మూసేశారు. కేవలం విద్యుదుత్పత్తి ద్వారా 6 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌పైన ఉన్న ఆలమట్టి ప్రాజెక్టుకు 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో విద్యుదుత్పత్తి ద్వారా 15 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులోనూ అన్ని గేట్లను మూసివేశారు.
నేడు పంప్‌హౌస్‌ల ప్రారంభం
జూరాలపై ఆధారపడిన నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టుల పంప్‌హౌస్‌లను గురువారం నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు ఆత్మకూర్ మండలంలోని భీమా లిఫ్ట్-2 పంప్‌ను ప్రారంభించిన అనంతరం 10.30 గంటలకు నెట్టెంపాడు ఫేజ్-2, తర్వాత కొత్తకోట సమీపంలోని భీమా ఫేజ్-2ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నర్వ మండలంలోని నాగిరెడ్డిపల్లి వద్ద కోయిల్‌సాగర్-1 లిఫ్ట్ పంప్‌హౌస్‌ను ప్రారంభిస్తారు. జూరాల కింద ఉన్న లక్ష ఎకరాలతో పాటు కల్వకుర్తి కింద 1.50 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.50 లక్షలు, భీమా ద్వారా 1.40 లక్షలు, కోయిల్‌సాగర్ ద్వారా 20 వేల ఎకరాలకు కలిపి మొత్తంగా 5.60 లక్షల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జూరాల నీటిని వీలైనంత ఎక్కువగా ఈ ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లకు మళ్లించాలని ఇప్పటికే నిర్ణయించారు. కృష్ణా జలాల్లో తమకున్న నీటి వాటా 299 టీఎంసీల్లోంచే ఈ నీటిని వాడుకుంటున్నందున ఇందుకు ఎవరి అభ్యంతరం ఉండబోదని ప్రభుత్వం భావిస్తోంది.
విద్యుదుత్పత్తి ప్రారంభం
జూరాల ప్రాజెక్టులో బుధవారం రాత్రి 9.30 గంటల నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభించారు. మొత్తం ఆరు టర్బయిన్లు ఉండగా ఒక టర్బయిన్ ద్వారా 35 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేస్తూ 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం ఉదయం మిగతా 5 టర్బయిన్లతోపాటు లోయర్ జూరాల నుంచి కూడా విద్యుదుత్పత్తిని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.