నల్లాలకు ఆటోమేటిక్ మీటర్లు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచబ్యాంకు సూచనల మేరకు గ్రేటర్ పరిధిలో ప్రతి నల్లాకు ఆటోమేటిక్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ముందుగా ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో మల్కాజ్‌గిరి మున్సిపల్ సర్కిల్ పరిధిలో రూ.338 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన మంచినీటి పథకంలో ఈ మీటర్ల వినియోగాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. సర్కిల్ పరిధిలో సుమారు 25 వేల గృహవినియోగ నల్లాలకు వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకోసం రూ.53 కోట్ల అంచనా వ్యయంతో ఆటోమేటిక్ మీటర్లను ఏర్పాటు చేయనుంది.
ఇందుకయ్యే వ్యయాన్ని సైతం ప్రపంచబ్యాంకు మంజూరు చేయనుంది. మీటర్ల ఏర్పాటుతోపాటు నీటి సరఫరాను ఆన్‌లైన్‌లో పక్కాగా పర్యవేక్షించేందుకు స్కాడా (సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) వ్యవస్థను సైతం ఏర్పాటు చేయనుంది. కాగా మల్కాజ్‌గిరి మంచినీటి సరఫరా పథకంతో ఈ ప్రాంత దాహార్తి తీరనుందని జలమండలి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి 262 కి.మీ మార్గంలో ప్రధాన పైపులైన్లు, మరో 376 కి.మీ మార్గంలో పంపిణీ పైపులైన్ల ద్వారా ఈ ప్రాంతంలో మంచినీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది సెప్టెంబరు నాటికి రిజర్వాయర్లు సైతం అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రస్తుతం మల్కాజ్‌గిరి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలకు వారం, పదిరోజులకోమారు నీటిసరఫరా జరుగుతోంది. ఈపథకం పూర్తితో కృష్ణా, గోదావరి జలాలను సర్కి ల్ వ్యాప్తంగా సరఫరా చేసే అవకాశం ఉంటుం దని, ఆటోమేటిక్ నీటిమీటర్ల ఏర్పాటుతో భవిష్యత్‌లో 24 గంటలపాటు నీటిసరఫరా చేసినప్పటికీ నీటి లెక్కలు పక్కాగా లెక్కగట్టడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు.
మీటర్ల ఎంపిక వినియోగదారులదే..!
గ్రేటర్‌వ్యాప్తంగా ఆటోమేటిక్ మీటర్ల విధానాన్ని అమలు చేసేందుకు రూ.1600 కోట్లు వ్యయం కానుంది. ఈ మొత్తాన్ని ఎవరు భరిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాగా మహానగరంలో 8.65 లక్షల నల్లాలుండగా..ప్రస్తుతం సగం నల్లాలకే నీటి మీటర్లున్నాయి. దీంతో ప్రతి నల్లాకు నీటి మీటరు ఏర్పాటు చేసుకునే బాధ్యతను జలమండలి వినియోగదారులకే అప్పజెప్పింది. గతంలో యూరో ప్రమాణాల ప్రకారం ఎంపికచేసిన తొమ్మిది మీటర్ కంపెనీలకు చెందిన మీటర్లనే విధిగా కొనుగోలు చేయాలన్న షరతు విధించింది.
వీటి ధరలు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఉన్నాయి. దీంతో కొందరు వినియోగదారులు ఇటీవల కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్పందించింది. వినియోగదారులు తమ ఇష్టానుసారం మీటర్లు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉండాలని వ్యాఖ్యానించింది. కాగా బహిరంగ మార్కెట్‌లో మెకానికల్ నీటిమీటర్లు రూ.500 నుంచి రూ.750కు మాత్రమే లభ్యమవుతున్నాయి. కోర్టు వ్యాఖ్యలతో జలమండలి అధికారులు వెసులుబాటు కల్పించక తప్పనిపరిస్థితి ఏర్పడినప్పటికీ ఈవిషయంలో తుదినిర్ణయం తీసుకోక పోవడం గమనార్హం.