కాపులంతా ముద్రగడ వెనుక ఉంటాం: అంబటి | we all are with mudragada padmanabham, says ambati rambabu | Sakshi
Sakshi News home page

కాపులంతా ముద్రగడ వెనుక ఉంటాం: అంబటి

Published Tue, Aug 30 2016 2:24 PM | Last Updated on Fri, May 25 2018 7:29 PM

కాపులంతా ముద్రగడ వెనుక ఉంటాం: అంబటి - Sakshi

కాపులంతా ముద్రగడ వెనుక ఉంటాం: అంబటి

కాపులకు రిజర్వేషన్లు సాధించే పోరాటంలో ముద్రగడ పద్మనాభం ఒంటరి కాదని.. ఆయన వెనుక ప్రతి కాపు సోదరుడు ఉన్నారని కాపు నాయకుడు, వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు నివాసంలో ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర కాపు ప్రముఖులు సమావేశమయ్యారు. ఆ సమావేశం విశేషాలను అంబటి రాంబాబు మీడియాకు తెలిపారు. ముద్రగడ పద్మనాభం 14 రోజుల పాటు కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన తీరు అభినందనీయమని, ఆయన్ను అమానవీయంగా అణిచేయడానికి చంద్రబాబు ప్రభుత్వం అనేకరకాల అక్రమ మార్గాలు అన్వేషించినా, ఆయన ధైర్యంగా పోరాడి విజయం సాధించారని చెప్పారు.

కాపులను బీసీలలో చేరుస్తామని, సెప్టెంబర్ ఏడో తేదీలోగా ఆ హామీని నెరవేరుస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. అప్పటివరకు ఆగి 7వ తేదీ తర్వాత ఏం చేయాలో అనే కార్యాచరణ గురించి కూడా చర్చించామని అంబటి చెప్పారు. కాపులను బీసీలలో చేర్చాలన్న హామీని ప్రభుత్వం నెరవేర్చేలా చేసేందుకు ముద్రగడ పద్మనాభం సర్వసన్నద్ధం అవుతున్న నేపథ్యంలో ఆయనకు అండగా ఉండేందుకు తామంతా ఆయన వెంట ఉన్నామని చెప్పేందుకే సమావేశం అయ్యామన్నారు. పద్మనాభం ఒంటరి కాదని.. ఆయన ఉద్యమం వెనుక ప్రతి కాపు సోదరుడు ఉన్నారని చెప్పారు. ఏ పార్టీలో, ఏ స్థాయిలో ఉన్నా.. అందరం కలిసికట్టుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.

ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోతే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లాలని అంతా ముక్తకంఠంతో నిర్ణయించామని తెలిపారు. ఉద్యమాన్ని నీరుగార్చాలనే చంద్రబాబు వ్యూహానికి కాపునేతలు తగిన ప్రతివ్యూహాలు రూపొందించారని, తాము ఇప్పటికే ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చాలని అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏమీ అడగట్లేదని అన్నారు. వాటిని నెరవేర్చకపోతే ఏం జరుగుతుందో కాపులు చూపిస్తారని హెచ్చరించారు. ఇక పవన్ కల్యాణ్ తమతో కలిసొస్తారో లేదో అనే అంశం ఆయననే అడగాలని మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement