ముద్రగడను అంతం చేయాలనే వేధింపులు!
ముద్రగడను అంతం చేయాలనే వేధింపులు!
Published Tue, Nov 15 2016 3:39 PM | Last Updated on Fri, May 25 2018 7:29 PM
కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండుతో సత్యాగ్రహ పాదయాత్ర చేపడుతున్న మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని భౌతికంగా అంతం చేయాలనే వేధింపులు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు చేయడం కొత్త కాదని, ముద్రగడ మాత్రం అలా పాదయాత్ర చేయడానికి అనుమతి లేదని హోం మంత్రి చినరాజప్ప, డీజీపీ అంటున్నారని.. వాళ్లిద్దరూ చెప్పినంత మాత్రాన చట్టాలు మారిపోతాయా అని ఆయన ప్రశ్నించారు. ముద్రగడ యాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పద్మనాభం ఇంటి పక్కన చిన్న జిన్నింగు మిల్లు ఉంటే దాన్ని ఆక్రమించుకుని పోలీసులు అక్కడ చేరారని, ఇది సరైన విధానం కాదు, దీన్ని మార్చుకోవాలని చెబుతున్నామని అన్నారు. ముద్రగడను అడ్డుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, పాదయాత్రను అడ్డుకుంటే తీవ్రమైన పరిణామాలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరుగుతాయని హెచ్చరించారు.
పద్మనాభం పాదయాత్రకు 15 వేల మంది పోలీసులను మోహరించారని, ఇది ప్రజాస్వామ్యమా, రాచరికమా, మిలటరీ పాలన సాగుతోందా అని ప్రశ్నించారు. అంతమంది పోలీసులను అక్కడ పెట్టి ఏం చేయాలనుకున్నారని, రాష్ట్రాన్ని ఎలా పాలించాలనుకుంటున్నారని నిలదీశారు. ముద్రగడ సత్యాగ్రహ యాత్ర చేపట్టడానికి కారణం చంద్రబాబు కాదా, 6 నెలల్లో బీసీలలో చేరుస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమా కాదా, ఏడాదికి వెయ్యికోట్లతో పథకాలు చేపడతామన్నది నిజమా కాదా అని ఆయన నిలదీశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయాలనుకుంటే దాన్ని అణిచేసే ప్రయత్నాలు చేయడాన్ని అతి దారుణమైన అంశంగా భావిస్తున్నామన్నారు. పద్మనాభం ఏకాకి కాదని, ఆయన వెనక రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్య శక్తులన్నీ ఉన్నాయని, కాపుసమాజం మొత్తం ఆయన వెనక ఉందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఆయనకు మద్దతు పలుకుతున్నాయన్నారు.
తుని ఘటన తర్వాత ఇదే ముద్రగడ నిరాహార దీక్ష చేస్తే.. మంత్రివర్గ సభ్యులు వెళ్లి ఆగస్టు లోపల కాపులను బీసీలలో చేరుస్తామని హామీ ఇచ్చారని.. దాన్ని నిలబెట్టుకోలేదనే ఇప్పుడు సత్యాగ్రహ పాదయాత్ర చేస్తామంటే.. దాన్ని అణిచేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. తుని ఘటన తర్వాత ఆయన కుటుంబాన్ని తీవ్రంగా అవమానపరిచి 15 రోజులు ఆస్పత్రిలో ఖైదీగా బంధించి ఇబ్బంది పెట్టారని.. అయినా మొక్కవోని ధైర్యంతో ప్రాణాలను సైతం పణంగా పెట్టి విజయం సాధించిన వ్యక్తి పద్మనాభం అని అన్నారు. ఇప్పుడు మళ్లీ కాపు రిజర్వేషన్ల కోసం ఆయన రావులపాలెం నుంచి పాదయాత్ర చేస్తామంటే దాన్ని చిందరవందర చేయాలని యోచిస్తున్నారని ఆరోపించారు. ఇది వాళ్లకేం కొత్త కాదని, గతంలో వంగవీటి మోహన రంగాను కూడా వేధించి, హత్యచేసింది అప్పటి తెలుగుదేశం పార్టీయేనని గుర్తుచేశారు.
Advertisement
Advertisement