హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏ శిక్షకైనా సిద్ధమే' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన హైదరాబాద్లోని అసెంబ్లీ కమిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కమిటీ ముందు అభిప్రాయాలు చెప్పడానికి వైఎస్ఆర్సీపీ కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగ్గిరెడ్డి, రాచముల్లు ప్రసాద్ రెడ్డి, దాడిశెట్టి రాజా, కొరముట్ల శ్రీనివాసులు హాజరయ్యారు.
గత నెల ఎనిమిది నుంచి పది వరకూ జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశాన్ని చర్చించాలనే సభలో పట్టుబట్టామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ప్రశ్నిస్తే పీడీ యాక్టులు పెడతామన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ప్రభుత్వం మమ్మల్ని టార్గెట్ చేసిందని జగ్గిరెడ్డి ఆరోపించారు.
ఎమ్మెల్యేలనే సస్పెండ్ చేస్తే ఇతరులు భయపడి ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయరని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉందని ఆయన అన్నారు. విపక్ష ఎమ్మెల్యేలు ఎవరూ సభ సాంప్రదాయలను ఉల్లంఘించలేదన్నారు. స్పీకర్ తమకు తండ్రి లాంటి వారని చెప్పారు. హోదా కోసం మాట్లాడే అవకాశం ఇవ్వాలనే స్పీకర్ను కోరినట్టు తెలిపారు. హోదా వల్లనే భవిష్యత్ అని లక్షలాది యువత ప్రశ్నిస్తోందని చెప్పారు. యువత కోసమే ప్రత్యేక హోదా కావాలని పోరాడుతున్నామని తెలిపారు. ప్రివిలేజ్ కమిటీ ముందు సమాధానం చెబుతామని జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. ప్రివిలేజ్ కమిటీ ఉన్నది ఎమ్మెల్యేల హక్కులను రక్షించడానికి కానీ, ప్రత్యేక హోదా కోసం నినదించిన మమ్మల్ని శిక్షించాలని కమిటీ చూస్తోందని అని రాచముల్లు ప్రసాదరెడ్డి వాపోయారు.