
శాసన సభ్యత్వాలను తాకట్టు పెట్టం
తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవాళ్లం తాము కానేకాదని, మంత్రి పదవులకోసమో.. కోట్ల కోసమో తమ శాసన సభ్యత్వాలను తాకట్టు పెట్టేవారం కాదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు నిర్ద్వంద్వంగా ప్రకటించారు.
♦ పార్టీలోనే ఉంటాం...జగనన్న వెంటే నడుస్తాం
♦ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవాళ్లం తాము కానేకాదని, మంత్రి పదవులకోసమో.. కోట్ల కోసమో తమ శాసన సభ్యత్వాలను తాకట్టు పెట్టేవారం కాదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు నిర్ద్వంద్వంగా ప్రకటించారు. మార్చి 5 నుంచి ప్రారంభమవనున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్ని పురస్కరించుకుని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సమావేశమైన ఎమ్మెల్యేలంతా ఆయన నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం ప్రకటించారు.
అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నీతిమాలిన చర్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తమకు పార్టీ మారే ఆలోచన లేకున్నా ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు తమ ఫొటోలు వేసి మరీ ప్రచారం చేయడం, ఊహాగానాలు రాయడం దారుణమన్నారు. ఏ ఆధారంతో ఈవార్తలు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. అలా దుష్ర్పచారం చేస్తున్న టీవీ చానళ్లు, పత్రికలపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
జగన్ వల్లే ఎమ్మెల్యేలమయ్యాం: కాకాని
ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే అది జగన్ వల్లేనని, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ జిల్లాలోని ఎమ్మెల్యేలంతా జగన్ వెంటే ఉంటారని నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్దన్‌రెడ్డి ప్రకటించారు. సహచర ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలసి ఆయన మాట్లాడుతూ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేసి వెళ్లొచ్చు గానీ.. తాము ప్రజలకు, పార్టీ నేతకు ద్రోహం చేసేవాళ్లం కానేకాదన్నారు.
కల్లబొల్లి కబుర్లా: ఈశ్వరి
టీడీపీ ప్రలోభాలకు లొంగి వైఎస్సార్‌సీపీని వీడుతున్న ఎమ్మెల్యేలు అభివృద్ధికోసమే అక్కడకు వెళుతున్నామనడం కల్లబొల్లి కబుర్లేనని గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యానించారు. కంబాల జోగు లు, విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, వంతెల రాజేశ్వరితో కలసి ఆమె మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవులిస్తామని,రూ. కోట్లు ఇస్తామని అధికారపార్టీ నుంచి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయన్నారు.
బానిసలుగా వెళ్లారు: నారాయణస్వామి
పార్టీ మారిన ఎమ్మెల్యేలు చంద్రబాబుకు బానిసలుగా వెళ్లారని చిత్తూరుజిల్లా ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి విమర్శించారు. అసలు భూమానాగిరెడ్డి ఎందుకు టీడీపీలోకి వెళ్లారంటూ పలు ప్రశ్నలు సంధించారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేల అనర్హతకు కృషిచేస్తామని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యేలను తెస్తే కమీషన్లు: ఉప్పులేటి
ఫిరాయింపుల్ని ప్రోత్సహించి టీడీపీలోకి ఎమ్మెల్యేల్ని తెచ్చేవారికి చంద్రబాబు కమీషన్లు కూడా ఇస్తున్నారని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉప నేత ఉప్పులేటి కల్పన అన్నారు. ఎమ్మెల్యేల్ని తెచ్చినందుకు రూ.50 లక్షల నుంచి రూ.కోటివరకూ ముడుతున్నాయన్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తనను తాను రాజనీతిజ్ఞుడుగా చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి నీతిమాలిన రాజకీయాలకు పాల్పడ్డం దారుణమన్నారు. ప్రభుత్వం తన ఆదరణ కోల్పోతున్నపుడు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారంటూ ప్రచారం లేవదీయడం పరిపాటైందని కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. కృష్ణా జిల్లాలో తామంతా జగన్ వెంటే ఉన్నామని మేకా ప్రతాప అప్పారావు స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వ వైఫల్యాల్ని అసెంబ్లీ వేదికగా ఎండగడతామని ఆదిమూలపు సురేష్ అన్నారు.