
అంజిరెడ్డిని ఆదుకోలేరా?
తెలంగాణ కోసం ఆత్మహత్యాయత్నం చేసిన ఉద్యమకారుడు
♦ చికిత్స కోసం రూ.5 లక్షలకు పైగా అప్పులు
♦ సీఎం కేసీఆర్ ఆదేశించినా అందని సాయం
♦ ప్రత్యేక జీవో లేదంటూ దాటవేస్తున్న అధికారులు
సాక్షి నల్లగొండ: ధూంధాంలతో ప్రత్యేక తెలం‘గానం’ వినిపిస్తూ.. ఊరూరా ప్రజలను చైతన్య పరుస్తూ కళా కారులు ముందుకు సాగుతున్న రోజులవి. 2010 ఫిబ్రవరి 3న నల్లగొండ జిల్లా అనుముల మండలం హాలియా గ్రామంలో గాయని మధుప్రియ ఆధ్వర్యంలో ధూంధాం రసవత్తరంగా సాగుతోంది. అప్పటికే ఉద్యమంలో ఉత్సా హంగా పాల్గొంటున్న స్థానికులకు ఆ ధూంధాం మరింత ఆవేశాన్ని, ఆగ్రహజ్వాలను రగిల్చింది. ఇంతలో అక్కడ అలజడి మొదలైంది. చందా అంజిరెడ్డి అనే యువకుడు తీవ్ర ఆవేశంతో.. తెలంగాణ రాదేమోనన్న భయంతో ఒక్క సారిగా జై తెలంగాణ నినాదం చేస్తూ స్టేజీ పైకి దూసు కొచ్చాడు.
చేతిలో ఉన్న కత్తితో గొంతు, పొట్టలో పొడుచు కున్నాడు. రక్తపు మడుగులో ఉన్న అంజిరెడ్డిని నాగార్జున సాగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆదిత్య కేర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి తెలంగాణ డాక్టర్ల సంఘం జేఏసీ అధ్యక్షుడు, ఇప్పటి భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అతడికి శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. నెల రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందాడు. ఈ సమయంలో కేంద్ర కార్మిక శాఖమంత్రి బండారు దత్తాత్రేయ, నిజామా బాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జేఏసీ చైర్మన్ కోదండరాం పలువురు ఉన్నారు.
ఇతను ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేసరికి రూ.5 లక్షలకు పైగా ఖర్చయింది. పేద, మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన అంజిరెడ్డి తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి కొడుకు ప్రాణాలు కాపాడగలిగారు. ఇంతలోనే తెలంగాణ రావ డం, కేసీఆర్ ముఖ్యమంత్రి అవడంతో వారిలో కొత్తగా ఆశలు చిగురించాయి. తెలంగాణ ప్రభుత్వం ఏ విధం గానైనా ఆదుకోకపోతుందా అనే ఆశతోనే అంజిరెడ్డి సహాయం కోసం కలవని మంత్రి లేడు.. ప్రజాప్రతినిధి లేడు. విసుగు చెందిన అంజిరెడ్డి చివరి ప్రయత్నంగా సీఎల్పీ నేత జానారెడ్డిని కలసి తన గోడు వెళ్లబోసు కున్నాడు. అంజిరెడ్డికి సాయం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
స్పందించిన కేసీఆర్ ఉద్యోగ కల్పన, ఆర్థిక సాయం చేయాలని అప్పటి జిల్లా కలెక్టర్ చిరంజీవులును ఆదేశించారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. జిల్లాలు మారాయి.. కలెక్టర్లూ మారుతున్నారు. అయినా..అంజిరెడ్డి తలరాత మాత్రం మారడం లేదు. నేటికీ వడ్డీలు కడుతూ దుర్భర జీవితం గడుపుతున్న అంజిరెడ్డి.. ఏనాటికైనా ప్రభుత్వం తమను ఆదుకుం టుందనే చిన్ని ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నాడు.