
లోగుట్టు ఏమిటో?
విచారణ పేరుతో చర్యలలో జాప్యం
కార్బైడ్ కేసులో మరో కోణం
సిటీబ్యూరో: గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ అక్రమాలకు అడ్డాగా మారుతోంది. ఆ మచ్చను తొలగించుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు విచారణల పేరుతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. కార్బైడ్‌నుదుకాణాల్లో పెట్టుకొని ఏడుగురు కమీషన్ వ్యాపారులు అడ్డంగా దొరికితే... మార్కెటింగ్ శాఖ అధికారులు ఆరుగురిపైనే చర్యలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాయలను మగ్గబెట్టేందుకు గడ్డిఅన్నారం మార్కెట్లో వ్యాపారులు యథేచ్ఛగా కార్బైడ్ వినియోగిస్తున్న తీరుపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ, రెవెన్యూ, ఫుడ్‌సేఫ్టీ, పోలీసు శాఖల అధికారులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించి 7 దుకాణాల్లో అక్ర మంగా నిల్వ చేసిన కార్బైడ్‌ను పట్టుకున్నారు. అనంతరం మార్కెటింగ్ శాఖ అధికారులు చినీ ఫ్రూట్ కంపెనీ, అల్హాందిల్లా ఫ్రూట్ కంపెనీ, జనతా ఫ్రూట్ కంపెనీ, మహ్మద్ అమీరుద్దీన్ ఫ్రూట్ కంపెనీ, సత్యవీరారెడ్డి ఫ్రూట్ కంపెనీ, సైదియా ఫ్రూట్ కంపెనీ, శ్రీరాం అండ్ కంపెనీల దుకాణాలను సీజ్ చేశారు. తర్వాత ఐదుగురు కమీషన్ వ్యాపారుల లెసైన్స్‌లను రద్దు చేసిన అధికారులు... సైదియా ఫ్రూట్ కంపెనీని వదిలేశారు.
వీరిలో సత్యవీరారెడ్డి కంపెనీకి గతంలోనే లెసైన్స్ రద్దయింది. కోర్టు స్టేతో ఆ దుకాణం మాత్రం ఆయన పొజిషన్‌లో ఉంది. ఇప్పుడు దాన్ని కూడా సీజ్ చేశారు. దాడుల్లో సైదియా ఫ్రూట్ కంపెనీ దుకాణం వద్ద 20 బాక్స్‌ల్లో కార్బైడ్ లభించింది. అయితే తన దుకాణం వద్ద ఎవరో దీన్ని పెట్టుకున్నారని కంపెనీ యజమాని వాదిస్తుండగా వికారాబాద్‌కు చెందిన హష్రాఫ్ ఆ సరుకు తనదేనంటూ అప్పట్లో అధికారులకు తెలిపాడు. ఆ వ్యక్తి సైదియా ఫ్రూట్ కంపెనీ యజమాని వహీద్‌కు సంబంధించిన వాడేనన్న ఆరోపణలున్నాయి.
సాగుతున్న విచారణ
ఈ వ్యవహారంలో కేసు నుంచి వ్యాపారిని తప్పించేందుకే మార్కెటింగ్ శాఖ అధికారులు విచారణలో జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సైదియా ఫ్రూట్ కంపెనీపై చర్యలు తీసుకొనే ముందు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఎంక్వైరీ ఆపినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే అప్పట్లో వదిలేసి ఇప్పుడు ఏ కారణంతో విచారణ చేస్తారన్నది మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల ప్రశ్న. ఈ విషయమై ఆ శాఖ డిప్యూటీ డెరైక్టర్ ఎల్లయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా ఇటీవలే స్టాండింగ్ కమిటీ ఒపీనియన్ తీసుకున్నామని, విచారణ జరిపి ఆ సరుకు వారిదేనని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల వరుసగా సెలవులు రావడంతో లీగల్ ఒపీనియన్ తీసుకోవడంలో జాప్యమైందన్నారు. కమీషన్ వ్యాపారితో కుమ్మక్యయ్యారన్న ఆరోపణలను ఆయన ఖండించారు.