పొత్తులపై సీపీఐ తెలంగాణ ఎన్నికల కమిటీ చర్చ నేడు
దిగ్విజయ్‌సింగ్‌ను కలసిన నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన, వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీపీఐ తెలంగాణ ఎన్నికల కమిటీ తొలిసారి శనివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో భేటీ కానుంది. వచ్చే ఎన్నికలలో పొత్తులు, సర్దుబాట్లకు ఉన్న అవకాశాలు, నియోజకవర్గాల గుర్తింపు, ప్రతిపాదిత అభ్యర్థుల జాబితా తయారీ వంటి అంశాలను ఈ కమిటీ ప్రధానంగా చర్చిస్తుంది. ఉభయ రాష్ట్రాలకు సారథిగా ఉన్న కె.నారాయణ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది.
2004, 2009 నాటి పరిస్థితులకు నేటికీ చాలా తేడా రావడంతో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే దానిపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న అవకాశాల్లో ఒకటి టీఆర్‌ఎస్. ఇందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా సముఖంగానే ఉన్నారు. అయితే తమకు బలమున్న దక్షిణ తెలంగాణ జిల్లాల్లో టీఆర్‌ఎస్ బలమైన శక్తిగా ఎదగలేదన్న అభిప్రాయం సీపీఐలో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేంత వరకు పట్టుపట్టి సాధించిన కాంగ్రెస్‌తో సర్దుబాట్లు చేసుకుంటే మేలని కూడా కొన్నిజిల్లాల నేతలు వాదిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో కె.నారాయణ శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా అభినందనలు తెలిపేందుకు వెళ్లానని నారాయణ ప్రకటించినా.. ఈ కలయిక వెనుక వేరే ఉద్దేశం ఉన్నట్టు పరిశీలకుల అంచనా.