మూడో విడత రుణమాఫీ ఎప్పుడు? | When the third installment of the loan waiver? | Sakshi
Sakshi News home page

మూడో విడత రుణమాఫీ ఎప్పుడు?

Published Sun, Jun 5 2016 2:30 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

When the third installment of the loan waiver?

- సొమ్ము కోసం బ్యాంకులు.. రుణం కోసం రైతుల ఎదురుచూపులు
- ఖరీఫ్ విత్తనాలు, ఎరువులు, సాగు పెట్టుబడులు లేక అన్నదాతల అవస్థలు
- రుణమాఫీ నిధులు విడుదల చేయకుంటే బ్యాంకులు రుణమిచ్చే పరిస్థితి లేదు
- కరువు సాయం విడుదలపైనా అస్పష్టత.. ఖరీఫ్‌తోనే కష్టాలూ మొదలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌తో పాటు రైతులకు కష్టాలూ మొదలయ్యాయి. నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న అంచనాలతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కానీ పెట్టుబడులకు పైసా లేని దుస్థితి. రుణం కోసం బ్యాంకులకు వెళితే.. ‘రుణమాఫీ’ మూడో విడత సొమ్ము విడుదలయ్యాకే ఇస్తామంటూ కొర్రీలు పెడుతున్నాయి. రుణమాఫీ సొమ్ముకు, కొత్త రుణాల మంజూరుకు సంబంధం లేదని సర్కారు చెబుతున్నా.. బ్యాంకులు మాత్రం రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళనలో కూరుకుపోతున్నారు. మూడో విడత రుణమాఫీ సొమ్ము విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

 బడ్జెట్‌లో కేటాయించినా..
 రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు మాఫీ పథకాన్ని ప్రకటించింది. 35.82 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.17 వేల కోట్లను మాఫీ చేయాలని నిర్ణయించింది. అందులో మొదటి విడతగా 2014లో రూ.4,230 కోట్లు, గతేడాది రెండో విడతగా రూ.4,040 కోట్లు విడుదల చేసింది. మరో రెండు విడతల సొమ్ము రూ.8,080 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అందులో ఈ ఏడాది మూడో విడత కింద రూ.4,040 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. దీనికి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించినా.. విడుదల చేయలేదు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతుండడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు.

 బోగస్‌లను గుర్తించాకే!
 మూడో విడత నిధులను విడుదల చేయడానికి ముందు రుణమాఫీ పొందిన బోగస్ రైతులను గుర్తించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. బోగస్ పాసు పుస్తకాలు, బినామీ పేర్లతో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం.. అనర్హులను గుర్తించాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది కూడా. తొలి, రెండు విడతల్లో విడుదల చేసిన మాఫీ సొమ్ములో ఎంత మేరకు అక్రమాలు జరిగాయన్న దానిపై సమగ్ర పరిశీలన చేసే అవకాశాలున్నాయి. ఇక కేంద్రం విడుదల చేసిన ఇన్‌పుట్ సబ్సిడీ సొమ్మును రైతులకు ఇవ్వడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబించడంపై విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement