ఆ వారం ఎప్పుడొస్తుందో! | When was that weak | Sakshi
Sakshi News home page

ఆ వారం ఎప్పుడొస్తుందో!

Published Mon, May 16 2016 12:51 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

ఆ వారం ఎప్పుడొస్తుందో! - Sakshi

ఆ వారం ఎప్పుడొస్తుందో!

కారుణ్య నియామకాలపై ముందుకు కదలని ఫైళ్లు
 
♦ వారం రోజుల్లోనే కుటుంబీకులకు ఉద్యోగమిస్తామన్న సీఎం
♦ ఏళ్లకేళ్లుగా నిరీక్షిస్తున్న బాధిత కుటుంబాలు..గోడు పట్టని కలెక్టర్లు
 
 సాక్షి, హైదరాబాద్: సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే వారం రోజుల్లోగా ఆ కుటుంబీకుల్లో అర్హులైన వారికి నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కారుణ్య నియామకాల విషయంలో మానవీయంగా ఆలోచించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా నియామకపు ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని, ఆ విభాగంలో ఖాళీలు లేకపోతే వేరే విభాగాల్లో సర్దుబాటు చేస్తామని జనవరి 2న మంత్రిమండలి సమావేశం అనంతరం సీఎం స్వయంగా ప్రకటించారు.

కానీ కారుణ్య నియామకాల ఫైళ్లు ఇప్పటికీ ప్రతి జిల్లాల్లో వందకుపైగా పెండింగ్‌లోనే ఉన్నాయి. బాధిత కుటుంబాలకు ఖాళీలున్న చోట అవకాశం కల్పించేందుకు నిబంధనలు ప్రతిబంధకంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్లు సైతం వీటివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రధానంగా సర్వీసులో ఉండగా చనిపోయిన ఉపాధ్యాయ కుటుంబీకులు చాలాచోట్ల వీధిన పడ్డారు. ఏళ్లకేళ్లుగా ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోతున్నారు. ‘2012 నవంబరులో సర్వీసులో ఉండగానే మా నాన్న చనిపోయారు. కమాన్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా పని చేశారు.

కారుణ్య నియామకం ఇస్తామన్న అధికారులు నాలుగేళ్లుగా తిప్పుకుంటున్నారు. బీటెక్ పూర్తి చేశాను. ఈ ఉద్యోగం వస్తుందా రాదా అన్న విషయం తేల్చుకోలేకపోతున్నా’ అని నాలుగేళ్లుగా కరీంనగర్ జెడ్పీ చుట్టూ తిరుగుతున్న ఓ యువకుడు తన మనోవేదన వెల్లగక్కాడు. గత నెలలో అధికారులను కలిసినా మరో ఏడాది పడుతుందని బదులిచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి యువతీ యువకులు కరీంనగర్ జిల్లాలోనే మరో 61 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికిపైగా ఇలా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు.
 
 ప్రతిబంధకంగా ఆ నిబంధన..

 ఏ శాఖలో ఉద్యోగి చనిపోతే అదే శాఖలో ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధనతో పాటు రోస్టర్ పాయింట్ ప్రకారం ఖాళీ ఉంటేనే నియామకం చేపట్టాని నిబంధన ఉంది. ఇదే కారుణ్య నియామకాలకు ప్రతిబంధకంగా మారింది. కారుణ్య నియామక పథకం కేవలం ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. కార్పొరేషన్లు, కో-ఆపరేటివ్ సొసైటీ, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు ఈ పథకాన్ని అన్వయించుకున్నప్పటికీ వారి కుటుంబీకులను ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయడానికి వీల్లేదని అందులో పేర్కొంది. దీంతో జిల్లా పరిషత్, మండల పరిషత్ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు చనిపోతే వారి కుటుంబాలకు దిక్కులేకుండా పోయింది. స్థానిక సంస్థల పరిధిలో మినిస్టీరియల్, ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలు చాలా తక్కువ.

అందుకే బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పరిస్థితి లేదని, ఖాళీలు లేవంటూ జెడ్పీ అధికారులు చేతులెత్తేస్తున్నారు. కలెక్టరేట్ పరిధిలో ఉండే వివిధ శాఖల ఉద్యోగులు చనిపోతే ఖాళీలున్న చోట బాధిత కుటుంబీకులను సర్దుబాటు చేసే విధానం అమల్లో ఉంది. అదే తీరుగా స్థానిక సంస్థల పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులను సైతం ఎక్కడ ఖాళీ ఉన్నా భర్తీ చేసేందుకు చొరవ చూపాలని పలుమార్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని పదేపదే ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ.. అందుకు సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలేమీ జారీ కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement