దారేది? | Where is the way in city | Sakshi
Sakshi News home page

దారేది?

Published Wed, Jan 13 2016 3:44 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

దారేది? - Sakshi

దారేది?

రెట్టింపైన ట్రా‘ఫికర్’..
♦ గత ఎన్నికల హామీలన్నీ గాలికి..
♦ నగర విస్తీర్ణానికి తగ్గట్టు లేని రోడ్లు
♦ రద్దీ వేళలో వాహనాల వేగం 12 కిలోమీటర్లే
 
 నగరానికి జీవనాడులు రోడ్లే. వాటిపై ప్రయాణం సాఫీగా సాగితేనే నగర జీవనం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటి వరకూ హైదరాబాద్‌కు ఆ అదృష్టం లేదు. చిక్కుముడుల ట్రాఫిక్ పద్మవ్యూహంలో అభిమన్యుడిలా నగరవాసి బలవుతూనే ఉన్నాడు. నగరంలో ఏ వాహనదారుడిని పలకరించినా ట్రాఫిక్ ఇక్కట్లే సమాధానం అవుతున్నాయి. గత ఎన్నికల వేళ.. ‘ఈ సమస్య ఇకపై ఉండదు’ అన్న నేతలు ఆ తరువాత దీన్ని పక్కన పెట్టేశారు. ఈ ఎన్నికల్లో అదే పద్ధతి పాటిస్తే కుదరదని చెబుతున్నారు నగరవాసులు. భాగ్యనగరిలో ట్రాఫికర్‌కు కారణాలు.. పరిష్కరించే మార్గాలు..
 నేటి పబ్లిక్ డిమాండ్‌లో...    ..: సాక్షి సిటీబ్యూరో, కుత్బుల్లాపూర్
 
 ఏ నగరానికైనా విస్తీర్ణం, జనాభాకు అనుగుణంగా రోడ్లు ఉండాలి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నగర విస్తీర్ణంలో 12 శాతం రోడ్లు ఉండాలి. హైదరాబాద్‌లో కేవలం 6 శాతం మాత్రమే ఉన్నాయి. నిజాం హయాంలో నాటి జనాభాకు అనుగుణంగా ప్రత్యేక నమూనాతో హైదరాబాద్‌ను నిర్మించారు. కాలక్రమంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ట్రాఫిక్ పాట్లు, ఫీట్లు అన్నీఇన్నీ కావు. ఇక వీటికి మెట్రోరైల్ పనుల వల్ల ఏర్పడుతున్న జామ్‌లు అదనం. కొన్ని కీలక ప్రతిపాదనలు అమలు చేస్తే హైదరాబాద్ నగరంలో రోడ్ల విస్తీర్ణాన్ని  15.5 శాతానికి పెంచే అవకాశం ఉంది. అంటే అంతర్జాతీయ ప్రమాణాల కంటే 3.5 శాతం అదనం. అలాగే వాహనాల సరాసరి వేగం అనుకున్న స్థాయిలో లేదు. దీంతో విలువైన సమయం, వేల కోట్ల ఇంధనం వృథా అవుతోంది.

 ఏం చేస్తే మారుతుంది..
 నగరం ట్రాఫికర్ నుంచి బయటపడేందుకు కీలక మార్పులు చేయాలంటూ అనేకసార్లు ట్రాఫిక్ పోలీసులు జీహెచ్‌ఎంసీకి ప్రతిపాదనలు పంపారు. అవన్నీ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. వాటిలో ప్రధానమైనవి..

 ట్రక్ టెర్మినల్స్ ఏర్పాటు
► సిటీలోకి వచ్చే పెద్ద ట్రక్‌లు, లారీలు ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నాయి. అనేక ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. వీటి ప్రవేశంపై కొన్ని ఆంక్షలు ఉన్నా.. అవి సరిగా అమలు కావడం లేదు. దీనికి పరిష్కారంగా నగర శివార్లలో జాతీయ రహదారులపై ‘ట్రక్ టెర్మినల్స్’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇది ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంది.
 ప్రైవేట్ బస్సులకు స్టాండ్లు
► రోడ్లపై ఇష్టానుసారం పార్కింగ్ చేస్తోన్న ప్రైవే టు బస్సులు ట్రాఫిక్ సమస్యకు మరో ప్రధాన కారణం. ఈ సమస్య పరిష్కారానికి  ప్రైవేట్ బస్సుల కోసం స్టాండ్స్ ఏర్పాటు చేయాలి.
 ఇరుకు రోడ్ల విస్తరణ
► వేగంగా సాగే ట్రాఫిక్‌ను హఠాత్తుగా ఇరుకు రోడ్లు అడ్డుకుంటున్నాయి. వీటి వల్ల ట్రాఫిక్ జాంతో పాటు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. నగరంలో ఆక్రమణలు, బాటిల్ నెక్స్ (ఇరుకు) కారణంతో 106 ప్రాంతాల్లో రోడ్లను అత్యవసరంగా విస్తరించాలి.
 
 ఇంకెన్నాళ్లీ దుస్థితి..
 కృష్ణానగర్ నుంచి బంజారాహిల్స్‌లోని మా కార్యాలయానికి వెళ్లాలంటే ట్రాఫిక్ చుక్కలు చూడాల్సిందే. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దాటితే పెద్ద గండం గట్టెక్కినట్టే.  ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు. గ్రేటర్ బరిలో నిలిచే నాయకులు ట్రాఫిక్‌పై దృష్టి సారించాలి. దీన్నే ప్రధాన సమస్యగా గుర్తించి. పరిష్కారానికి కృషి చేయాలి.
 
 బాబోయ్ ట్రాఫిక్...
  ప్రతిరోజూ బోయిన్‌పల్లి నుంచి అమీర్‌పేట వరకు వెళ్తాను. బాలానగర్ మీదుగా ఫతేనగర్, బల్కంపేట ఫ్లైఓవర్ నుంచి అమీర్‌పేట్ వెళ్లాలంటే చుక్కలు చూడాల్సిందే. మొత్తం దూరం 14 కిలోమీటర్లు అయితే వెళ్లడానికి పట్టే సమయం గంట. ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బల్కంపేట ఫ్లైఓవర్‌పై ఏదైనా వాహనం ఆగిపోతే పరిస్థితి అధ్వానం. ట్రాఫిక్ విషయంలో కచ్చితమైన నిర్ణయాలు ప్రకటించి ముందుకు సాగే నాయకుడికే నా ఓటు.
 
 3.83 లక్షలు కొత్త ఓటర్లు
 సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 3,83,530 మంది ఓటర్లుగా నమోదయ్యారని
 జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 70,67,934 మంది ఓటర్లుండగా, కొత్త ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 74,51,464కు చేరుకుందని చెప్పారు. పెయిడ్ న్యూస్ తదితర అంశాలపై మంగళవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ అభ్యర్థుల ఖర్చులను సరిగ్గా లెక్కించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
 
 అభ్యర్థి ఖర్చు గణనకీ ఓ లెక్క..
 జాబితా విడుదల చేసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి
 సాక్షి, సిటీబ్యూరో : అభ్యర్థులు ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు చేసి తక్కువగా చూపించడం పరిపాటే. అయితే దానికి అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు వినూత్న ప్రయోగం చేశారు. ఆయా వసతులు, పదార్థాలకు సంబంధించి ధరల జాబితాను జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఈ జాబితాలోని ధరల మేరకే అభ్యర్థుల ఖర్చులను నిర్ధరిస్తారు.
 
 ప్రత్యామ్నాయ మార్గాలెక్కడ..?
 తక్కువ రోడ్ల విస్తీర్ణం వల్ల కోల్‌కతా నగరం ట్రాఫిక్ జాంతో తీవ్ర అవస్థలు పడింది. ఆ సమస్యపై అధ్యయనం చేసి అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించి రోడ్ల విస్తీర్ణం ఆరు శాతం పెంచారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 21 ఫ్లైఓవర్లు ఉన్నాయి. మరో 23 అవసరమవుతాయని ట్రాఫిక్ అధికారుల అంచనా. 2007లోనే ఈ ప్రతిపాదనలు వచ్చినా అటకెక్కించారు. ప్రతి ఫ్లైఓవర్‌కు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా వాటిని మరిచారు.
 
 హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనరేట్ పరిధిలో..
 
18 పోలీసుస్టేషన్ల పరిధిలో 53 చోట్ల జంక్షన్ల అభివృద్ధి 17 పోలీసుస్టేషన్ల పరిధిలో 62 చోట్ల పూర్తిస్థాయి డివైడర్లు 25 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 259 చోట్ల రోడ్ మార్కింగ్స్ కనిపించకపోవడం ట్రాఫిక్ జాంకు మరింత కారణమవుతోంది
 
 ఇవీ అవసరం
 ప్రధాన ప్రాంతాల్లో  32 బస్‌బేలను తరలించాలి
 8 ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో స్కూల్ జోన్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న 21 చోట్ల స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలి
 21 ప్రాంతాల్లో ప్రత్యామ్నాయమార్గాల అభివృద్ధి చేయాలి

  సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో..
 226 చోట్ల స్టాప్‌లైన్, జీబ్రా క్రాసింగ్, లైన్ మార్కింగ్, యారో మార్కింగ్, సెంట్రల్ లైన్ మార్కింగ్స్ జాడలేదు. కమిషనరేట్ పరిధిలోని 10 చోట్ల ఫ్లైఓవర్లు అత్యవసరం.
 
70 ప్రాంతాల్లో బస్‌బేలు నిర్మిస్తే ట్రాఫిక్‌కు కొంత ఊరట.
 ఢిల్లీలోని ఎఫ్‌ఓబీ
 రోడ్లపై పాదచారులు నడిచేందుకు సదుపాయం లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమవుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్‌లో మరో 37 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు(ఎఫ్‌ఓబీ) నిర్మించాలని 2011లోనే ప్రతిపాదించారు. కొత్తవి కట్టకపోగా ‘మెట్రో’ పనుల పేరిట ఉన్న ఎఫ్‌ఓబీలను తొలగిస్తున్నారు.
 
 ఇరుకు రోడ్లతో ఇబ్బందులెన్నో
 సిటీ రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. రోడ్లను తక్షణమే విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిరోజూ ప్రయాణంలో ట్రాఫిక్ చిక్కులతో చికాకు పడాల్సిందే. ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ సరేసరి. దీనికి తోడు ఆటోవాలాల ఆగడాలు. ముఖ్యంగా మాసబ్‌ట్యాంక్ లాంటి ప్రాంతాల్లో ఆటోవాలాల అడ్డగోలు డ్రైవింగ్‌తో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సమస్యలపై దృష్టి సారించి, పరిష్కారం దిశగా ఆలోచించే నాయకులకే ఎన్నికల్లో ప్రాధాన్యం.
 
 ప్రత్యామ్నాయాలపై దృష్టి
 ట్రాఫిక్ ఇబ్బందుల తొలగింపు, రోడ్డు భద్రత పెంపునకు సంబంధించి అనేక ప్రతిపాదనలు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొన్ని భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాం. పరిస్థితులకు అనుగుణంగా వీటిని అమలు చేస్తూ, ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నాం. జంక్షన్లలో ఫ్లైఓవర్లకు ప్రత్యామ్నాయంగా ‘క్లోజింగ్’ చేపట్టాం. ఉప్పల్, జేఎన్‌టీయూ వంటి కీలక చోట్ల జంక్షన్లను మూసేసి, కాస్త ముందుకు వెళ్లాక ‘యూ టర్న్స్’ ఇవ్వడం ద్వారా ఫలితాలు సాధించాం.
 - అవినాశ్ మహంతి, సైబరాబాద్ ట్రాఫిక్ చీఫ్
 
 15కి.మీ..100 నిమిషాలు
 అపర్ణ, సాఫ్ట్‌వేర్ డెవలపర్
 ఉదయం 10:00 గంటలకు ఆల్విన్ కాలనీ నుంచి బయలుదేరితే గచ్చిబౌలి ఇనార్బిట్ మాల్‌కు చేరుకునే సరికి 11:40 అవుతుంది.  హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పైనే చాలాసేపు ట్రాఫిక్‌లో చిక్కుకుంటా. రోజూ ఇదే పరిస్థితి. ట్రాఫిక్ సమస్య పరిష్కారమే పార్టీల ఎజెండాలో ప్రథమంగా ఉండాలి. దీని పరిష్కారానికి శాశ్వత ప్రణాళికలు రూపొందించాలి. ఆ దిశగా పనిచేసే పార్టీ నాయకుడికే నా ఓటు.
 
 సగటు ప్రయాణికుడి మాట
 పొద్దున్నే ఐదు గంటలకు లేచి.. పనులు ముగించి.. ఏడు గంటలకు బస్టాండ్‌కు వస్తే.. ఆ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు.  ఒకవేళ వస్తే.. వేలాడుతున్న జనాల్ని నెట్టుకుంటూ తంటాలుపడి ఎక్కితే.. నిమిషానికోసారి ట్రాఫిక్ జాం. ఈ చివరి ఈసీఐఎల్ నుంచి ఆ చివర గచ్చిబౌలికి చేరేసరికి లేట్ ఎందుకయ్యిందంటూఆఫీసులో బాస్ చివాట్లు.. ఈ సమస్యను దాటుకొని రాత్రి పది గంటలకు ఇంటికి చేరితే భార్య చిటపటలు తప్పెవరిది..శిక్షెవరికి!?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement