
ఫీజు బకాయిలు ఎవరు చెల్లిస్తారో?
ఏపీలో 10 లక్షల మంది బీసీ, ఈబీసీ విద్యార్థుల ఎదురుచూపు
ఆందోళనలో చివరి సంవత్సరం విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ల సాయంతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏ ఈడాది కొత్త సమస్య వచ్చిపడింది. ఆర్థిక పరిస్థితి పేరిట ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, చోటు చేసుకుంటున్న పరిణామాలు వారిలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లోని 7.4 లక్షల మంది బీసీ, 2.78 లక్షల మంది ఈబీసీ విద్యార్థులకు 2013-14 విద్యా సంవత్సరానికి అందాల్సిన రూ.800 కోట్ల బకాయిల చెల్లింపు ఇంతవరకు జరగలేదు.
అసలు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఈ పెండింగ్ బకాయిలు ఎవరు చెల్లించాలనే విషయంపైనే ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. రాజధానితో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు ఎవరు చెల్లించాలనే అంశంపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమకు కళాశాలల నుంచి సర్టిఫికెట్లు అందుతాయా లేదా? అన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు.
కొలిక్కిరాని కౌన్సెలింగ్ ప్రక్రియ
ఏటా ఈపాటికే ఇంజనీరింగ్, మెడికల్ తదితర ఉన్నత విద్యా కళాశాలలు అడ్మిషన్లు పూర్తిచేసుకుని కొంతమేరకు సిలబస్‌ను కూడా పూర్తి చేసుకునేవి. ఈ ఏడాది మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎంసెట్ ఫలితాలు విడుదలై నెలరోజులు దాటుతున్నా ఇప్పటివరకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవకపోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.