తెలుగు రాష్ట్రాలపై చలి పంజా!
► మరో ఐదు రోజులపాటు పెరగనున్న చలి తీవ్రత
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది. చలిగాలులు పెరిగిపోయాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతదేశం నుంచి చలిగాలులు వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతున్నాయి. వచ్చే ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 7.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి చలికాలం మొదలైన తర్వాత ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలిసారని వాతావరణశాఖ పేర్కొంది.
ఇక్కడ ఉష్ణోగ్రతలు ఐదారు డిగ్రీలకు కూడా పడిపోయే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక రామగుండం, నిజామాబాద్‌ల్లోనూ సాధారణం కంటే తక్కువగా 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. మరో ఐదు రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందని.. అనంతరం సాధారణ స్థితి నెలకొంటుందని ప్రకటించింది. మరోవైపు రాజధాని హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత పెరిగింది.
శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీలుగా నమోదయింది. వచ్చే 48 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు తగ్గే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే శీతాకాలం ప్రారంభమై ఇన్ని రోజులైనా ఇప్పటివరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదారు డిగ్రీల వరకు అధికంగానే నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి కూడా. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని అధికారులు చెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా పిల్లలు, పెద్దలు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
రామగుండం, నిజామాబాద్ జిల్లాల్లో 13 డిగ్రీలకు పడిపోయింది. ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలున్నాయని.. వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. అలాగే హైదరాబాద్‌లో తేమ సాధారణం కన్నా 22 శాతం తక్కువగా ఉంది. తేమ తగ్గడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పగటిపూట మాత్రం సాధారణం కన్నా ఎండ వేడి కాస్త ఎక్కువగానే ఉంటోంది. మరోవైపు ఆంధ్రాలోనూ చలి చంపేస్తోంది. చలి ధాటికి జనం వణికిపోతున్నారు. విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. మినుములూరులో 6, లంబసింగిలో 7, పాడేరులో 8, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.