
మంత్రికి తెలియకుండా మార్కెట్ కమిటీ నియామకం!
అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లిన మంత్రి మాణిక్యాలరావు
సాక్షి, హైదరాబాద్: మంత్రి మాణిక్యాలరావుకు తెలియకుండా, కనీసం సమాచారం సైతం ఇవ్వకుండా ఆయన సొంత నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ నియామకం జరిగిందట. ఇదే విషయాన్ని ఆయన ఆదివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. పర్యటనలో అమిత్‌షా పార్టీ నేతలతో ప్రత్యేకంగా ఎలాంటి సమావేశం నిర్వహించకపోయినప్పటికీ.. స్వాగత, వీడ్కోలు కార్యక్రమంతో పాటు మధ్యాహ్న భోజన విరామ సమయంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు.
టీడీపీతో కలసి రాష్ట్రంలో అధికారం పంచుకుంటున్నా బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరిగే పరిస్థితులు లేవంటూ ఫిర్యాదుల చిట్టా విప్పారు. మంత్రి మాణిక్యాలరావుతో సహా పలువురు నాయకులు తమ తమ నియోజక వర్గాల్లో టీడీపీ నేతల నుంచి తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపారు. మంత్రిగా ఉన్న తనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నేతలు నిత్యం తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మాణిక్యాలరావు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. పైగా కొందరిపై తాను తప్పుడు కేసులు పెట్టిస్తున్నానంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. దీనికి స్పందించిన అమిత్‌షా ‘రాష్ట్రంలో జరుగుతున్న చాలా విషయాలు మా దృష్టికి వస్తున్నాయి. చూద్దాం..’ అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
‘గవర్నర్ ప్రసంగం’పై అమిత్‌షా ఆశ్చర్యం
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీనిలబెట్టుకోలేదంటూ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించడంపై అమిత్‌షా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదివారం రాజమహేంద్రవరంలో బహిరంగ సభకు ముందు అమిత్ షా కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో షా వద్ద రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకుడొకరు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం పాఠంలో పేర్కొన్న అంశం పత్రికల్లో ప్రచురితం కావడాన్ని ప్రస్తావించారు. దీనిపై అమిత్‌షా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ‘నిజమేనా’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.