వరదల నివారణపై కసరత్తు
- వర్షాలకు ముందే కేంద్ర జలవనరుల శాఖ సన్నద్ధత!
- వరద ప్రభావిత ప్రాంతాల గుర్తింపునకు చర్యలు
- విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న అంచనా నేపథ్యంలో అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర జల వనరుల శాఖ అప్రమత్తమైంది. వర్షాలకు ముందే వరదల నివారణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి నష్ట నివారణకు కార్యాచరణను రూపొందించుకోవాలని ఆదేశించింది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న అంచనా నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన నదుల బేసిన్‌ల పరిధిలో వరద కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల గుర్తింపు, ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సూచన మేరకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర జల సంఘం, రాష్ట్ర నీటి పారుదల శాఖ గుర్తించిన ప్రధాన వరద ప్రభావిత ప్రాంతాలకు తోడు, ఉపనదుల పరిధిలోనూ ప్రభావిత ప్రాంతాలను గుర్తించే పనిని ఆరంభించింది.
కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలో రాష్ట్రంలో ఇప్పటికే ఆరు వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. ఇందులో ప్రధానంగా కృష్ణా బేసిన్‌లో 2009లో శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో వచ్చిన 25 లక్షల క్యూసెక్కుల వరద ఇప్పటివరకు నమోదైన వాటిల్లో గరిష్టం. గోదావరి బేసిన్‌లో 1983లో శ్రీరాంసాగర్ పరిధిలో 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లు కేంద్ర జల సంఘం రికార్డులు చెబుతున్నాయి. ఇదే 2009లో నాగార్జునసాగర్ గరిష్ట వరద 14.50 లక్షల క్యూసెక్కులు. శ్రీశైలం వరద సందర్భంగా జరిగిన నష్టం అంతాఇంతా కాదు. వరదను ఎదుర్కొనే ముందస్తు సన్నద్ధతలో విఫలం కావడంతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది విసృ్తతంగా వర్షాలు కురుస్తాయన్న అంచనా నేపథ్యంలో మంజీరా, గోదావరి మధ్య ప్రాంతం, మానేరు, పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి దిగువ ప్రాంతం, ఇంద్రావతి, లోయర్ భీమా, లోయర్ కృష్ణా, తుంగభద్ర, మూసీ, పాలేరు, మున్నేరు, డిండి, హాలియా వరద ప్రభావిత ప్రాంతాల్లో దానిపై శాస్త్రీయమైన అధ్యయనం చేయాలని కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఓ కమిటీని సైతం జల వనరుల శాఖ ఏర్పాటు చేసింది. ఆటోమెటిక్ రెయిన్ గేజ్ స్టేషన్లు, ఆటోమెటిక్ వాటర్ లెవల్ రికార్డులు, డిజిటల్ వాటర్ లెవల్ రికార్డుల ఏర్పాటు ఏ స్థాయిలో అవసరమో ఈ కమిటీ అంచనా వేయనుంది. అన్ని రకాల అప్రమత్తత స్టేషన్లు కలిపి రాష్ట్రంలో 64 ఉండాలి. కానీ, 52 మాత్రమే ఉన్నాయని గుర్తించిన కేంద్ర జల సంఘం మిగతా వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.