
కేటీఆర్‌తో యశోధర రాజె భేటీ
మధ్యప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి యశోధర రాజె సింధియా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతో ....
పారిశ్రామిక, వ్యవసాయ రంగాలపై విస్తృత చర్చ
హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి యశోధర రాజె సింధియా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతో గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఆమె ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో పారిశ్రామిక విధానం, పరిశ్రమల అభివృద్ధి తదితర అంశాలపై ఇరువురు మంత్రులు చర్చించారు. సీఎం కేసీఆర్ పరిపాలన విధానాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని యశోధర రాజె తెలిపారు. తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికల్లో అధికారపార్టీ విజయం సాధించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయం, ఆటో, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలను ప్రాధాన్యాలుగా ఎంచుకుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో తాము తీసుకున్న చర్యల ఫలితంగా రైతులకు అధిక దిగుబడులు వస్తున్నాయని వివరించారు. ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమలను పెద్ద ఎత్తున నెలకొల్పుతున్నట్లు చెప్పారు.
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం: కేటీఆర్
ఎలక్ట్రానిక్స్, ఐటీ, లైఫ్ సెన్సైస్, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పెట్టుబడుల కోసం తమ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. తమ పారిశ్రామిక విధానం ద్వారా మెరుగైన వసతులు, రాయితీలు కల్పించే వెసులుబాటు కలుగుతోందన్నారు. అనంతరం ఆమెను కేటీఆర్ సత్కరించారు.