టెస్ట్ డ్రైవ్ అని చెప్పి.. ఆడి కారుతో..
బంజారాహిల్స్: టెస్ట్ డ్రైవ్ పేరుతో ఖరీదైన ఆడి కారుతో ఉడాయించిన యువ డాక్టర్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్ అపోలో ఆస్పత్రి సమీపంలో ఉన్న ప్రీ ఓన్డ్ కార్స్ డీలర్ వద్దకు ఈ నెల 27న ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఓ యువకుడు వచ్చి తన పేరు గౌతంరెడ్డి అని అపోలో ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. ఓ కారు కొనుగోలు చేయాలని అందుకోసం టెస్ట్ డ్రై వ్ చేయాలంటూ అడిగాడు. దీంతో డీలర్ కాగితపు నరేంద్రకుమార్ ఆ యువ డాక్టర్‌కు ఏపీ 28 డీఆర్ 0005 ఆడి క్యూ3 కారును టెస్ట్ డ్రైవ్ కోసం ఇస్తూ తమ వద్ద పని చేస్తున్న కాశిని పర్యవేక్షకుడిగా పంపించాడు.
కారు నడుపుతూ గౌతంరెడ్డి అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకోగానే తన పక్కనే కూర్చున్న కాశిని ఒక్కసారి దిగాలని తానే సొంతంగా కొద్ది దూరం నడుపుతానంటూ చెప్పడంతో కాశి కారు దిగాడు. అంతలోనే గౌతంరెడ్డి కారుతోసహా ఉడాయించాడు. సాయంత్రమైనా తిరిగిరాకపోయేసరికి డీలర్ నరేంద్రకుమార్ అపోలో ఆస్పత్రిలో డాక్టర్ గౌతంరెడ్డి కోసం వాకబు చేయగా అలాంటివారు ఎవరూ లేరని తేలింది. తాము మోసపోయామని తెలుసుకొని బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా గౌతంరెడ్డిపై ఐపీసీ సెక్షన్ 379కింద కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కారు విలువ సుమారుగా రూ. 40 లక్షల వరకు ఉంటుందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.