అసెంబ్లీ వాకిట మార్షల్స్ ‘లా’! | ys jagan along with mlas stage protest at gandhi statue | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ వాకిట మార్షల్స్ ‘లా’!

Published Sat, Mar 19 2016 2:34 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

అసెంబ్లీ వాకిట మార్షల్స్ ‘లా’! - Sakshi

అసెంబ్లీ వాకిట మార్షల్స్ ‘లా’!

ఎమ్మెల్యే రోజా శాసనసభలోకి వెళ్లకుండా అడ్డగింత
 
 సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను శాసనసభలోనికి వెళ్లనివ్వకుండా, స్పీకర్ ఆదేశాలు  లేవంటూ మార్షల్స్ అడ్డుకున్నారు. తాను హైకోర్టు ఆదేశాలతో వచ్చానని, ఆ ఉత్తర్వులను గురువారం నాడే శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శికి అందజేశానని రోజా పలుమార్లు స్పష్టం చేసినా ఫలితం లేకుండా పోయింది. భారీయెత్తున మోహరించిన పోలీసులు, మార్షల్స్ ఆమెను లోపలికి అనుమతించేందుకు ససేమిరా అన్నారు. ఇందుకు నిరసనగా విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలుత అసెంబ్లీ ప్రాంగణంలో, ఆ తర్వాత గాంధీ విగ్రహం ఎదుట ఫుట్‌పాత్‌పై పార్టీ ఎమ్మెల్యేలతో కలసి బైఠాయించారు.

ప్రభుత్వానికి, అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, వారికి వత్తాసుగా నిలుస్తున్న స్పీకర్ తీరును నిరసిస్తూ ఎమ్మెల్యేలు నినాదాలతో హోరెత్తించారు. విపక్షం మండుటెండలో రెండున్నర గంటలసేపు నిరీక్షించినా.. స్పీకర్ నుంచి కానీ, అధికారపక్షం వైపు నుంచి కానీ ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం కాకపోవడం విమర్శలకు తావిచ్చింది. ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చను స్పీకర్ కొనసాగించారు. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయడంపై హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులివ్వడం, శుక్రవారం తాను సభకు హాజరవుతానని రోజా ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయమే అడ్డగింత పర్వానికి తెరలేచింది.

ఉదయం 8:40 నిమిషాలకు రోజా తన న్యాయవాదులతో కలసి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. వారిని లోపలకు వెళ్లనివ్వకుండా మెయిన్ గేటువద్దనే పోలీసులు అడ్డుకున్నారు. రోజాను లోపలకు తీసుకువెళ్లేం దుకు అప్పటికే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, విశ్వాసరాయి కళావతి, గిడ్డి ఈశ్వరి, వంతెల రాజేశ్వరి, పాముల పుష్పశ్రీవాణి, గౌరు చరితారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కె.నారాయణస్వామి, గొట్టిపాటి రవికుమార్ తదితరులు అక్కడికి వచ్చి ఉన్నారు.  వాగ్వాదం చోటుచేసుకోవడం,మీడియా ప్రతినిధులు కెమెరాలతో అక్కడకు వచ్చి ప్రత్యక్ష ప్రసారాలు చేస్తుండడం.. అదంతా ప్రజల్లోకి వెళ్తుండడంతో అసెంబ్లీ భద్రతా సిబ్బంది న్యాయవాదులను మాత్రం అనుమతించబోమన్నారు. పోలీసులు రోజాను లోపలకు అనుమతించారు.

 స్పీకర్ మౌఖిక ఆదేశాలు..!
 ఎమ్మెల్యేలతో పాటు రోజా అసెంబ్లీ గేటు-2 నుంచి లోపలకు వెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయానికి వెళ్లే దారిలోనే మూడు వరుసల బారికేడ్లను భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు. అక్కడ పోలీసులు, మార్షల్స్ భారీగా మోహరించారు. తొలి బారికేడ్ వద్దనే చీఫ్ మార్షల్ గణేష్‌బాబు.. రోజాతో పాటు ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. లోపలకెళ్లేందుకు అనుమతి లేదనడంతో రోజా, చెవిరెడ్డి , కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నారాయణస్వామి, మహిళా ఎమ్మెల్యేలు ఆయన్ను నిలదీశారు. తాను కోర్టు ఆదేశాలతో వచ్చానని,ఉత్తర్వులను నిన్ననే స్పీకర్ కార్యాలయానికి అందించినందున లోపలకు అనుమతించాలని రోజా కోరారు.అనుమతించరాదని స్పీకర్ ఆదేశించినందున తాము ఏమీ చేయలేమని చీఫ్ మార్షల్ చెప్పారు. స్పీకర్ ఆదేశాలను  చూపాలని ఎమ్మెల్యేలు నిలదీయడంతో చీఫ్ మార్షల్ తెల్లముఖం వేశారు.

స్పీకర్ మౌఖిక ఆదేశాలిచ్చారన్నారు. ఆ సమయంలో అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి వచ్చి సభ లోపలకు అనుమతించవద్దని స్పీకర్ ఆదేశాలిచ్చారని చెప్పారు. తనను వైఎస్సార్‌సీఎల్పీ కార్యాలయం వరకైనా అనుమతించాలని, స్పీకర్ అనుమతి లేకుండా శాసనసభ సమావేశ మందిరంలోకి వెళ్లబోనని రోజా అడిగారు. దీనికీ మార్షల్స్ అంగీకరించలేదు. కోర్టు తీర్పును అమలు చేయబోమని, అసెంబ్లీ లోపలకు అనుమతించబోమని స్పీకర్ నుంచి  లిఖితపూర్వక పత్రం ఇస్తే తాము వెనక్కి వెళ్లిపోతామని, ఆ విషయాన్ని కోర్టుకే నివేదించుకుంటామని రోజా తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో నిషేధాజ్ఞలకు సంబంధించి విడుదల చేసే బులెటిన్ కాపీని చీఫ్ మార్షల్ చూపిస్తూ స్పీకర్ ఆదేశాలున్నాయని చెప్పబోయారు. ఆ కాపీని కాకాణి తీసుకొని చదివారు. ప్రాంగణంలో ధర్నాలు, ర్యాలీలు  చేయరాదనే బులెటిన్‌లో ఉందని, ఎమ్మెల్యేలను అడ్డుకోమని ఎక్కడ ఉందని ఆయన నిలదీశారు. అయినప్పటికీ లిఖితపూర్వక పత్రాలు తాము ఇవ్వలేమని, లోపలకూ అనుమతించబోమని అసెంబ్లీ అధికారులు చెప్పడమే కాక మరింతమంది మార్షల్స్‌ను ఎమ్మెల్యేల చుట్టూ మోహరింపచేశారు.

 వ్యవస్థలను గౌరవిస్తా: రోజా
 శాసనసభా వ్యవహారాలు, న్యాయస్థాన వ్యవహారాలంటే తనకు ఎంతో గౌరవమని ఎమ్మెల్యే రోజా అన్నారు. చట్టసభలో తనకు అన్యాయం జరిగిన తర్వాత న్యాయవ్యవస్థను గౌరవిస్తూ కోర్టుకు వెళ్లానని, అక్కడ న్యాయం జరిగిందని చెప్పారు. అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి సత్యనారాయణకు హైకోర్టు ఉత్తర్వులను గురువారమే అందజేశానన్నారు. సభలో ఉన్నవాళ్లంతా చదువుకున్నవాళ్లేనని, ఆర్డర్ చదివితే మంత్రి యనమల రామకృష్ణుడికి, స్పీకర్‌కి అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఏమీ చేయరని భావిస్తున్నానని, ఏం జరుగుతుందో చూడాలని రోజా వ్యాఖ్యానించారు. రోజా తరఫున వాదనలు వినిపిం చిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అసిస్టెంట్ రోజా వెంట అసెంబ్లీకి వచ్చారు.

 ప్రభుత్వం భేషజాలకు పోకూడదు: శ్రీకాంత్‌రెడ్డి
 రోజా సస్పెన్షన్ వ్యవహారంపై ఎవరూ భేషజాలకు పోకూడదని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పేర్కొన్న న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థలు మనకు రెండు కళ్లులాంటివని అన్నారు. శాసనసభను, న్యాయ వ్యవస్థను తాము గౌరవిస్తామన్నారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించకుండా హుందాతనాన్ని పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు.
 
 రోజా న్యాయవాదిని అడ్డుకున్న పోలీసులు

  అంతకుముందు తమను అనుమతించకపోవడంతో రోజా కారు నుంచి దిగిపోయిన ఆమె తరఫు న్యాయవాది అసెంబ్లీ ప్రాంగణం బయటే ఉండిపోయారు. 8.55 గంటలకు అక్కడికి చేరుకున్న జగన్ ఆమెను తన వాహనంలో ఎక్కించుకుని లోనికి తీసుకువెళ్లాలని భావించగా మార్షల్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో విపక్ష నేత తీవ్ర స్వరంతో.. ‘ప్రతిపక్ష నేతగా నేను నాతో పాటు ఒకరిని సభా ప్రాంగణంలోకి తీసుకెళ్లవచ్చు. ఆ విషయం మీకు తెలియదా?’ అని ప్రశ్నించారు. అయినా వారు అనుమతించక పోవడంతో ఆమెకు తన గుర్తింపు కార్డును ఇస్తానన్నారు. అందుకూ వారు అంగీకరించకపోవడంతో లోపలికి వెళ్లాక తన కార్యాలయం ప్రతినిధిగా ఆమెకు ‘అనుమతి పాస్’ను పంపుతానని చెప్పారు. అయినా పోలీసులు జగన్ వాహనాలను అడ్డగించి ఆమెను లోనికి అనుమతించలేదు. చివరకు జగన్ తన కార్యాలయ సిబ్బందికి చెప్పి ఆమెకు పాస్ ఏర్పాటు చేశారు. ఇద్దరు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు, మార్షల్స్, మహిళా మార్షల్స్ రోజాతో పాటు ఇతర ఎమ్మెల్యేలను లోపలకు వెళ్లనివ్వకుండా అడ్డుపడ్డారు.
 
 వైఎస్ జగన్ బైఠాయింపు

  ఇంతలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. తమ ఎమ్మెల్యేలు బయటే ఉండిపోవడంతో ఆయన కారు దిగారు. కోర్టు ఉత్తర్వులున్నా అసెంబీ ్లలోపలకు వెళ్లకుండా రోజాను ఎందు కు అడ్డుకుంటున్నారని చీఫ్ మార్షల్‌ను, డిప్యూటీ సెక్రటరీని ప్రశ్నించారు.ఇది మంచిపద్ధతి కాదని, ప్రతిపక్ష ఎమ్మెల్యే పట్ల  అవమానకరంగా వ్యవహరించడం తగదన్నారు. కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకపోవడమేమిటని నిలదీశారు. కోర్టు ఆదేశాల ప్రకారం తమ సభ్యురాలిని శాసనసభ లోపలకు వెళ్లనివ్వాలని, అలా వెళ్లనివ్వకపోవడానికి స్పీక ర్ నుంచి లిఖితపూర్వక ఆదేశాలుంటే చూపాలని చీఫ్‌మార్షల్‌ను డిమాండ్ చేశారు. ఎంతసేపైనా వారినుంచి స్పందన లేకపోవడంతో స్పీకర్ మౌఖికంగా ఆదేశించి ఉన్నట్లయితే అదే విషయాన్ని మీడియా ముందు చెప్పాలని, కనీసం వీడియో ద్వారానైనా చెప్పాలని అడిగారు. లోపలకు అనుమతించలేమని మార్షల్స్ స్పష్టం చేయడంతో విపక్ష నేత ఎమ్మెల్యేలతో సహా అక్కడే బైఠాయించారు. ‘హైకోర్టు తీర్పును గౌరవించని స్పీకర్... సిగ్గు సిగ్గు..., ప్రభుత్వ నిరంకుశవైఖరి... నశిం చాలి, సస్పెన్షన్‌పై స్టే పొందిన రోజాను అసెంబ్లీ లోనికి అనుమతించాలి..’ అంటూ ఎమ్మెల్యేలు పెద్దయెత్తున  నినాదాలు చేశారు.

ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రారంభమైన  బైఠాయింపు గంటన్నరకు పైగా కొనసాగింది. ఈలోగా అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ రెండుసార్లు, చీఫ్ మార్షల్ రెండుసార్లు అసెంబ్లీ లోపలకు వెళ్లి పరిస్థితిని పెద్దలకు వివరించి వచ్చారు.విపక్షమంతా గంటలకొద్దీ మండుటెండలోనే ఉన్నా.. స్పీకర్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ స్పందన లేకపోవడంతో.. ‘అసెంబ్లీ లోపలకు వెళ్లనిస్తారా లేదా చెప్పండి... లేదంటే బయటకు వెళ్లిపోతాం’ అని జగన్ ప్రశ్నించారు. అనుమతించబోమని చీఫ్ మార్షల్ అనడంతో జగన్ ఎమ్మెల్యేలతో కలసి ప్రధాన రోడ్డులోకి వచ్చి గాంధీ విగ్రహం ఎదురుగా ఫుట్‌పాత్‌పై  బైఠాయించారు.  అనంతరం గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement