'మిమ్మల్ని పాతేస్తాం' అన్నా చర్యల్లేవు
హైదరాబాద్ : తాము ఇప్పటివరకు దాదాపు 20 సార్లు ప్రివిలేజెస్ కమిటీకి ఫిర్యాదుచేసినా ఒక్కసారి కూడా విచారణకు ఆదేశించలేదని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ పార్టీ ఎమ్మెల్యేలంతా నల్ల దుస్తులతోనే శనివారం అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బుచ్చయ్య చౌదరి ఎంత అసభ్యంగా మాట్లాడుతూ మహిళలను కించపరిచారో చూశామని, ఆయనపై ఫిర్యాదుచేసినా చర్యలు లేవని అన్నారు. బోండా ఉమా అయితే 'మిమ్మల్ని పాతేస్తాం' అన్నా ఆ మాటలను కనీసం రికార్డు నుంచి తొలగించలేదని, చర్యలు తీసుకోలేదని చెప్పారు. రావెల కిశోర్ బాబు విచిత్రమైన భాష మాట్లాడారని, దానిపైనా ఫిర్యాదు చేశామని అన్నారు. ఇక మరోమంత్రి ఉమామహేశ్వరరావు 'మిమ్మల్ని తగలబెట్టేస్తాం, అంతుచూస్తాం' అన్నా చర్యలు లేవని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
'ఏకంగా సభా నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అంతుతేలుస్తా, పిచ్చాస్పత్రిలో చేరుస్తా అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. మంత్రి కామినేని శ్రీనివాస్ సైకోలు, పందులు అంటూ అన్ పార్లమెంటరీ మాటలు ఉపయోగించారు. ఇలా చేస్తే ఎవరికి వాళ్లమీద గౌరవం పెరుగుతుంది' అని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అన్ని ఆధారాలతో మేం ఫిర్యాదుచేస్తే ఏ ఒక్కదానిపైనా విచారణ కూడా జరపడం లేదు. ఎంత స్వార్థంతో వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. స్వయానా స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా రోజా సస్పెన్షన్ విషయంలో సభ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది అంటారు. ప్రతిపక్షం పూర్తిగా వ్యతిరేకించినా అది ఏకగ్రీవం ఎలా అవుతుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.