గడువులోగా పరిష్కరించకుంటే నిరసన
నోట్ల రద్దుతో ప్రజలు కష్టాలు పడుతున్నారు: వైఎస్ జగన్
- జనం ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవట్లేదు
- నోట్ల రద్దు గురించి చంద్రబాబుకు ముందే తెలుసు
- 26 రోజుల ముందే ప్రధానికి లేఖ రాసి ఘనత కొట్టేదామనుకున్నారు
- అలాంటి లేఖ రాయాలని ఎవరికీ ఆలోచన తట్టదు
- ముందస్తు సమాచారంతో రూ. వేల కోట్లు చక్కబెట్టుకున్నారు
- ‘రద్దు’కు రెండు రోజుల ముందే హెరిటేజ్ కంపెనీ షేర్లను అమ్మేశారు
- పన్నుల పరిధిని పెంచుకోవడానికే పెద్దనోట్ల రద్దు!
- జనవరి మొదటి వారం వరకూ పరిస్థితులను గమనిస్తాం..
- అప్పటికీ చక్కబడకపోతే ప్రజలతో కలసి నిరసనలే..
- గవర్నర్‌తో వైఎస్సార్‌సీపీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం భేటీ
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు వల్ల అన్ని వర్గాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకొని, కరెన్సీ కష్టాలను తీర్చాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. నోట్ల రద్దు వల్ల ఉత్పన్నమైన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీసం గవర్నర్ అయినా జోక్యం చేసుకుని తన పలుకుబడిని కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు వద్ద ఉపయోగించి రాష్ట్రానికి తగినంత నగదును తెప్పించాలని కోరారు. వైఎస్ జగన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి, నోట్ల రద్దు అనంతరం నెలకొన్న పరిణామాలు, ప్రజల కష్టాలను వివరించింది. దాదాపు అరగంటపాటు గవర్నర్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయనకు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. గవర్నర్‌తో భేటీ అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్‌భవన్ బయట మీడియాతో మాట్లాడారు. రూ.500, 1,000 నోట్ల రద్దు ప్రక్రియను చూస్తే ఇది నల్లధనాన్ని వెలికితీసేందుకు కాదనే విషయం బోధపడుతోందన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...
‘‘నాకు తెలిసినంత వరకూ ఈ ప్రక్రియ అంతా నల్లధనాన్ని వెలికితీయడం కోసం చేసినట్లుగా అనిపించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన లాంటి వ్యక్తులు ముందుగానే పూర్తిగా చక్కబెట్టుకున్నారు. నోట్ల రద్దు గురించి వారికి ముందే తెలుసు. పెద్ద నోట్ల రద్దుకు రెండు రోజుల ముందు చంద్రబాబు తన హెరిటేజ్ కంపెనీ షేర్లను ఫ్యూచర్ గ్రూపునకు ఆమ్మేయడం మన కళ్ల ముందే జరిగింది. హెరిటేజ్ సంస్థ నష్టాల్లో ఉన్నా అమ్మేసుకున్నారు. నోట్ల రద్దు నిర్ణయం నవంబర్ 8న వెలువడింది. అక్టోబర్ 12వ తేదీన, అంటే 26 రోజుల ముందు పెద్ద నోట్లను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అది తన ఘనతేనని చాటుకునే ప్రయత్నం చేశారు. నిజంగా ఇలాంటి అంశాలపై లేఖ రాయాలని మీకు గానీ, నాకు గానీ తట్టదు. ఈ భూ ప్రపంచంలో భూమి అంతా లేకుండా పోతుంది కాబట్టి చంద్రమండలంలో ఇళ్లు కడితే బాగుంటుందని మోదీకి నువ్వూ(మీడియాను ఉద్దేశించి), నేనూ లేఖ రాస్తే ఎలా ఉంటుంది? ఎవరో పిచ్చివాడు ఈ లేఖ రాశాడని అనుకుంటారు. కానీ, ఇలాంటి లేఖ రాయాలన్న ఆలోచన చంద్రబాబుకు రావడమే ఆశ్చర్యకరం. ముందస్తు సమాచారం ఉన్న చంద్రబాబులాంటి వారంతా తమ వద్ద ఉన్న రూ.వేల కోట్లు చక్కబెట్టుకున్నారు.
నోట్ల రద్దు.. నల్లధనం వెలికితీయడానికి కాదు!
మొత్తం చెలామణిలో ఉన్న నగదు రూ.14 లక్షల కోట్లు అని కొద్ది రోజుల క్రితం చెప్పారు. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగే కొద్దీ ఇప్పుడు ఈ మొత్తం కూడా పెరిగిపోతోంది. ఎందుకో మరి, ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. నోట్ల రద్దు ప్రక్రియ అంతా పన్నుల పరిధిని (ట్యాక్స్ బేస్‌ను) పెంచడం కోసమేనని అనిపిస్తోంది. అది నేరుగానే చేయవచ్చు. దానికి ఇంత బిల్డప్ (కసరత్తు) అవసరమే లేదు. రద్దయిన పెద్ద నోట్ల విలువలో కనీస స్థాయిలో కూడా ప్రత్యామ్నాయంగా నగదును కేంద్రం విడుదల చేయలేదు. వాస్తవానికి నోట్ల రద్దు వ్యవహారంతో గవర్నర్‌కు సంబంధం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదు కాబట్టి, హోదా రీత్యా నరసింహన్ ప్రధాని మోదీకి దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టి తన పలుకుబడిని వినియోగించి రాష్ట్ర ప్రజలకు తగినంత నగదు తెప్పించాలని కోరడానికే ఆయనను కలిశాం.
రిజర్వు బ్యాంకు నవంబర్ 4న ప్రకటించిన గణాంక వివరాల ప్రకారం.. దేశంలో మొత్తం చెలామణిలో ఉన్న నోట్ల విలువ రూ.17.74 లక్షల కోట్లు. ఇందులో రూ.15.25 లక్షల కోట్ల మేర రూ.500, రూ.1,000 నోట్లే. అంటే 86 శాతం మేర పెద్ద నోట్లే ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రకటించిన వివరాల ప్రకారం ఈ మొత్తం పెద్ద నోట్ల స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన నగదు రూ.5.5 లక్షల కోట్లు మాత్రమే. రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లు దేశవ్యాప్తంగా మొన్నటి వరకూ రూ.12.81 లక్షల మేర బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి అన్నారు. వాటి స్థానంలో చెలామణిలోకి తెచ్చిన నోట్ల విలువ రూ.5.5 లక్షల కోట్లు మాత్రమే. దీన్నిబట్టి మొత్తం రద్దయిన నగదులో 33 శాతమే కొత్త నగదు వచ్చి చేరింది. అంటే ఇంకా 67 శాతం కొత్త కరెన్సీ చెలామణిలోకి రావాల్సి ఉంది.
ఏపీకి వచ్చింది 24.5 శాతమే
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు రూ.60 వేల కోట్ల మేర రద్దయిన పాత నోట్లను డిపాజిట్ చేశారు. ఈ మొత్తం విలువకుగాను రాష్ట్రానికి రిజర్వు బ్యాంకు నుంచి ఇప్పటి వరకు వచ్చిన నగదు రూ.14,740 కోట్లు, అంటే కేవలం 24.5 శాతం మాత్రమే వచ్చింది. మొత్తం డిపాజిట్ అయిన విలువ మేరకు నగదు రాకపోతే ప్రజలు, రైతులు, రైతు కూలీలు తీవ్రంగా నష్టపోతారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం 50 రోజుల్లో పరిస్థితి సర్దుకుంటుందని ప్రధాని మోదీ చెప్పారు. డిసెంబర్ 30తో ఆ సమయం పూర్తవుతుంది. జనవరి 1, 2, 3 తేదీల్లో ఉద్యోగులకు జీతాలు వస్తాయి. జీతాలు వచ్చిన తరువాత కూడా ప్రజలు ఇంకా అగచాట్లు పడుతూ ఉంటే... ఆ సమయంలో ప్రధాని మోదీ చేసే ప్రకటనలు ఎలా ఉంటాయో చూస్తాం. అప్పటికి మొత్తం డబ్బు, నల్లధనం బయటకు వచ్చిందో లేదో కూడా తెలిసిపోతుంది. జనవరి తొలివారం వరకూ పరిస్థితులను గమనిస్తాం. అప్పటికీ పరిస్థితులు చక్కబడకపోతే మా పార్టీ మొత్తం కూర్చుం టుంది. దీనిపై విస్తృతంగా చర్చించి, ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతాం’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.