ఎమ్మెల్యే ఆర్కే వినూత్న నిరసన
గుంటూరు: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) వినూత్నంగా నిరసన తెలిపారు. గుంటూరు పట్టణంలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఆర్కే, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, ఇతర అధికారులు హాజరయ్యారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రజలకు తన మద్ధతు తెలిపేందుకు జెడ్పీ సమావేశం పూర్తయ్యేవరకు తాను నిలుచునే ఉంటానని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టంచేశారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో కష్టపడుతున్నారని చెప్పిన ఆయన సమావేశం పూర్తయ్యేవరకూ నిలబడే ఉన్నారు. పార్టీ నేత ఆర్కేకు మద్ధతుగా సమావేశం ముగిసేవరకూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు నిలబడి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా తమ నిరసన తెలిపారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత కేవలం 50 రోజులు ఓపిక పడితే కష్టాలు తీరుతాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు... కానీ, యాభై రోజులు గడిచినా ప్రజల కష్టాలు తీరడం లేదంటూ నోట్ల రద్దు నిర్ణయాన్ని వైఎస్ఆర్ సీపీ నేతలు వ్యతిరేకించారు. మరోవైపు రద్దయిన రూ.500, వెయ్యి రూపాయల నోట్లను మార్చుకునేందుకు తుది గడువు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే.