చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి!
హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుపై యూటర్న్ తీసుకున్న చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దనోట్లు రద్దు చేయాలని అక్టోబర్ 12వ తేదీన చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారని, ఆ తర్వాత నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోగా.. ఆ క్రెడిట్ ఇతరులు తీసుకుంటారేమోనన్న భయంతో రాత్రికి రాత్రే ప్రెస్‌మీట్ పెట్టి.. ప్రధానికి నోట్లు రద్దు చేయాలని చెప్పింది తానేనని చెప్పుకొన్నారని, ఇప్పుడేమో నోట్ల రద్దు మేం కోరుకున్నది కాదు, నోట్లను రద్దు చేశారంటూ సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని బుగ్గన మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
అక్టోబర్ 12న రూ. 500, రూ. వెయ్యినోట్లను రద్దుచేయాలని కోరుతూ లేఖ రాసింది మీరు కాదా? నవంబర్ 8వ తేదీన ప్రెస్‌మీట్ పెట్టి.. నా సలహా ప్రకారమే మోదీ నోట్లు రద్దు చేశారని చెప్పింది మీరు కాదా? అని చంద్రబాబును ఆయన నిలదీశారు. ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని చంద్రబాబు సలహా వల్లే తీసుకున్నారని భావిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా జనచైతన్య యాత్రల ద్వారా మీ మంత్రులు, మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇది మీ నిర్ణయమేనని ప్రజల్లో ప్రచారం చేశారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 60 నుంచి 70శాతం మంది వ్యవసాయం ఆధారపడ్డారని, ఇలాంటి పరిస్థితులలో పెద్దనోట్లను రద్దుచేయాలని మీరు ఎలా సలహా ఇచ్చారని చంద్రబాబును బుగ్గన ప్రశ్నించారు. 2014, 2015లో తీవ్ర కరువు వచ్చిన్పపటికీ పన్నెండున్నర లక్షల హెక్టార్లలో విత్తనాలు నాటారని, కానీ ఈ ఏడాది పెద్దనోట్ల రద్దు వల్ల 12 లక్షల హెక్టార్ల నుంచి 7.3 లక్షల హెక్టార్లకు నాట్లు, పంటసాగు తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మొదట పెద్దనోట్ల రద్దు తన క్రెడిట్యే అని చెప్పుకొన్న చంద్రబాబు ఆ తర్వాత దీనిని సరిగ్గా అమలుచేయలేదని బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇప్పుడేమో ఏకంగా ఇది తాము కోరుకున్నది కాదంటూ పూర్తిగా మాట మార్చారని బుగ్గన విమర్శించారు.