యూటర్న్ బాబు.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై మాట మార్చి ‘యూటర్న్’ తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని ప్రకటించగానే అదే రోజు రాత్రి స్వాగతిస్తూ... తాను లేఖ రాసినందుకే ఇలా చేశారని ఘనతను పొందేందుకు ప్రయత్నించిన చంద్రబాబు ఇపుడేమో ‘పెద్ద నోట్ల రద్దు మేం కోరుకున్నది కాదు’ అని మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు, మోదీకి అక్టోబర్ 12న లేఖ రాశారని, నవంబర్ 8వ తేదీన ఈ నిర్ణయం వెలువడిందని బుగ్గన గుర్తు చేశారు. చంద్రబాబు సలహా మేరకే నోట్ల రద్దు జరిగిందని టీడీపీ నేతలు ప్రచారం చేసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు నోట్ల రద్దు మనం కోరుకున్నది కాదని పార్టీ సమావేశంలో చంద్రబాబు చెబుతూ ఉంటే అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు అందరూ విస్తుపోయి బిక్క మొహాలు వేశారన్నారు. ప్రజలు పడుతున్న నోట్ల కష్టాలకు ముఖ్యమంత్రి పూర్తిగా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ఏపీలో 60 నుంచి 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడిన ప్రజలున్నపుడు పెద్ద నోట్లను రద్దు చేయాలని ఎలా సలహా ఇస్తారని బుగ్గన ప్రశ్నించారు. తాను ఇటీవల రాజస్థాన్‌కు వెళ్లి వచ్చానని అక్కడ కొత్త నోట్ల నగదు కోసం ఏటీఎంల వద్ద అంత పెద్ద క్యూలేమీ లేవని బుగ్గన వివరించారు. జైపూర్ తరువాత రెండో పెద్ద నగరమైన ఉదయ్‌పూర్‌లో ఏటీఎంల వద్ద క్యూలు లేవని, ప్రతి ఒక్కరికీ రిజర్వుబ్యాంకు మార్గదర్శకాల ప్రకారం రూ. 24,000 అందుతున్నాయన్నారు. రాజస్థాన్‌లో నగదు లభిస్తున్నపుడు ఏపీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఎవరో రూ. 10 వేల కోట్లు నల్లధనం వెల్లడి చేస్తే దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుని జగన్‌ను బద్నాం చేసేందుకు ప్రయత్నించారని, చివరకు అదంతా ఒట్టిదేనని తేలిందన్నారు.