
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భోగి పండుగ అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించాలని, సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలలోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరి ముంగిళ్ళలో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.
రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లతో, రకరకాల వేడుకలతో కూడిన సంక్రాంతి అంటేనే రైతులు, పల్లెల పండుగ అని వైఎస్ జగన్ అన్నారు. పాడి పంటలతో, పైరు పచ్చలతో ప్రతి పల్లె కళకళలాడినప్పుడే ప్రజలు ఆనందరంగా ఉంటారని, అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేలలో రైతన్నలు, గ్రామీణ వృత్తుల వారంతా భోగభాగ్యాలతో, సుఖసంతోషాలతో తులతూగాలని కోరుకుంటున్నట్లు ఆయన మకర సంక్రాంతి శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.