పాలమూరుపై ‘రాజ’ముద్ర!
సాగుఫలాలు అందించే దశలో వైఎస్ చేపట్టిన 4 ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: కరువు కోరల్లో చిక్కుకుని వలసబాట పట్టిన పాలమూరు రైతులను ఆదుకోవాలని, సాగుయోగ్యమైన ప్రతి ఎకరాకు నీళ్లు పారాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పం ఫలితాన్నిచ్చేందుకు సిద్ధమైంది. కృష్ణా జలాలను వినియోగంలోకి తెచ్చేలా చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, భీమా ప్రాజెక్టులను వైఎస్ చేపట్టారు. ఆయన అధికారంలో ఉన్న ఐదున్నరేళ్లలోనే ఈ 4 ప్రాజెక్టుల మొత్తం వ్యయంలో 60% ఖర్చు చేశారు. ఆ తర్వాత ఆరేళ్లకు ఇప్పుడు మిగతా పనులు పూర్తయ్యే దశలో ఉన్నా యి. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి 4.60 లక్షల ఎకరాలకు నీరందే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మిగతా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించే కసరత్తు జరుగుతోంది.
60% పనులు వైఎస్ హయాంలోనే..
సరైన నీటి వసతి లేక కరువుతో కొట్టుమిట్టాడుతున్న మహబూబ్‌నగర్ జిల్లా ముఖచిత్రాన్ని మార్చాలంటే మడి తడపడం తప్ప మరో మార్గం లేదని భావిం చిన వైఎస్ రాజశేఖరరెడ్డి... జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తి (25 టీఎంసీలు), భీమా (20టీఎంసీలు), నెట్టెంపాడు (20టీఎంసీలు), కోయల్‌సాగర్ (3.90టీఎంసీ)లను చేపట్టారు. 7.80 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంతో రూ.7,969.38 కోట్ల వ్యయ అంచనాతో నిర్మాణం ప్రారంభించారు. భారీగా నిధుల కేటాయింపులతో ప్రాజెక్టుల పను లు వేగంగా జరిగాయి.
2009 సెప్టెంబర్ నాటికి 60శాతం పనులు పూర్తయ్యాయి. రూ.2,990కోట్లతో చేపట్టిన కల్వకుర్తిలో వైఎస్ హయాంలో రూ.1,930.49 కోట్లు ఖర్చవగా, భీమా కింద రూ. 2,158.40 కోట్లలో రూ.1,492.38 కోట్లు, నెట్టెంపాడు కింద రూ.1,862.73 కోట్లలో రూ.1,124.52 కోట్లు, కోయల్‌సాగర్‌లో రూ.458.25 కోట్లకు రూ.235.91 కోట్లు ఖర్చయ్యాయి. అయితే వైఎస్సార్ మరణానంతరం ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. భూసేకరణ ఆలస్యం, పరిహా రం చెల్లింపులో ఇబ్బందులు, రహదారు లు, రైల్వే క్రాసింగ్‌లపై ప్రభుత్వాల పట్టిం పు తగ్గడంతో ప్రాజెక్టులన్నీ ఆలస్యమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టు సమయానికి, ఇప్పటి వ్యయానికి తేడా ఉండడంతో కాంట్రాక్టర్లు ఎస్కలేషన్ డిమాండ్ చేస్తూ 2013 నుంచి ప్రాజెక్టుల పనులను పూర్తిగా నిలిపివేశారు. వీటిపై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వం కసరత్తు చేసి ఓ కొలిక్కి తీసుకువస్తోంది. జీవో 123తో భూసేకరణను వేగి రం చేసింది. నాలుగు ప్రాజెక్టుల్లోని 36 ప్యాకేజీలకు సుమారు రూ.500కోట్ల మేర అదనంగా చెల్లించేందుకు అంగీకరించింది. ఇందులోనూ 30 ప్యాకేజీల ఎస్కలేషన్‌కు ప్రతిపాదనలు రాగా 10 ప్యాకేజీలకు స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ఓకే చేసింది. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.
ఈ ఖరీఫ్‌కే సాగు ఫలితాలు..
ఈ నాలుగు ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు సుమారు 1.50లక్షల ఎకరాలను వృద్ధిలోకి తెచ్చారు. గతేడాది వర్షాలు లేని కారణంగా ఈ ఆయకట్టుకు నీరందలేదు. ప్రస్తుత ఏడాది జూన్ నాటికి పాత ఆయకట్టు కలుపుకొని మొత్తంగా 4.60లక్షల ఎకరాలకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది మిగతా 3.20లక్షల ఎకరాలకు నీరిచ్చి మొత్తం ఆయకట్టుకు వృద్ధిలోకి తెచ్చేలా ప్రణాళికలు వేసింది. ఈ ఖరీఫ్ నాటికి అనుకున్న లక్ష్యాల మేరకు నీటిని అందించడం కష్టమేమీ కాదని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఆయకట్టుకు పారే ప్రతి నీటి బొట్టులో వైఎస్ వేసిన ముద్ర కనబడనుంది.