హరగోపాల్
హైదరాబాద్: పేదలకు మేలుచేసే అభివృద్ధి విధానాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసినందునే ఆయన రెండవసారి గెలిచారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కమిటీ హాలులో తెలంగాణ పీసీసీ 'భవిష్యత్ తెలంగాణ' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. సంక్షేమానికి కోతపెట్టాలన్న ప్రపంచ బ్యాంకు షరతులకు వైఎస్ ఒప్పుకోలేదన్నారు. ప్రపంచ బ్యాంకు షరతులకు అంగీకరించి, సంక్షేమానికి తిలోదకాలు ఇచ్చినందునే అప్పట్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయారని గుర్తు చేశారు.
విద్య ప్రైవేటీకరణ, కార్పోరేషన్ కాలేజీల వల్ల పేదలకు నష్టమే తప్ప లాభంలేదన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కార్పోరేషన్ కాలేజీలు ఇక ఉండవేమో అనుకున్నానని, అయితే ఎందుకో ఇంకా ఆ కాలేజీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాన్ని గౌరవించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. గత అయిదేళ్లలో కాంగ్రెస్ దేశాన్ని రిటైల్గా అమ్మితే ఇప్పుడు బీజేపీ హోల్సేల్గా అమ్మాలనుకుంటుందని విమర్శించారు. ఇదేవిధంగా కొనసాగితే 2019లో బీజేపీ గెలవదని చెప్పారు. యుపీఏ హయాంలో చిదంబరం అపరిమిత అధికారాలు అనుభవించారని అన్నారు. కానీ ఇప్పుడాయన బీజేపీ ప్రతినిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారని హరగోపాల్ తెలిపారు.
ఈ సదస్సులో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనరసింహ, ప్రొఫెసర్ కోదండరామ్, పలువురు కాంగ్రెస్ నేతలు, మేథావులు ప్రసంగించారు.
**