
ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడటమా?
ఎన్టీఆర్ మహానుభావుడన్న విషయం అందరికీ తెలుసని, అయితే గతంలో అసెంబ్లీ సాక్షిగా ఆయనను తూలనాడిన చంద్రబాబు ఇప్పుడు మహానాడులో మాత్రం ఎన్టీఆర్ గురించి చెప్పడమే విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.
ఎన్టీఆర్ మహానుభావుడన్న విషయం అందరికీ తెలుసని, అయితే గతంలో అసెంబ్లీ సాక్షిగా ఆయనను తూలనాడిన చంద్రబాబు ఇప్పుడు మహానాడులో మాత్రం ఎన్టీఆర్ గురించి చెప్పడమే విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇతర సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, గడికోట శ్రీకాంత్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రెండేళ్ల పాలన గురించి చెప్పుకోడానికి ఆయనకు ఏమీ లేదని, అందుకే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చెప్పి ప్రజలను భ్రమల్లోకి నెట్టేస్తున్నారని అన్నారు. మహానాడులో ప్రజల సమస్యల గురించి ఏమైనా చర్చించారా అని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతిని వ్యవస్థీకరించారని, రాజ్యాంగ విరుద్ధమైన కిరికిరి కమిటీలు వేసి ప్రజలను బాధ పెడుతున్నారని అన్నారు.
కమీషన్లకు కక్కుర్తి పడి పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టి పట్టిసీమను పట్టుకున్నారని విమర్శించారు. ఐదు నెలలుగా ఆరోగ్యశ్రీ డబ్బులు అందడం లేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా లేదని అన్నారు. ఆస్పత్రులలో వైద్య సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని పట్టించుకోవాల్సింది పోయి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే ఆలోచన దుర్మార్గమని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. నదులను అనుసంధానం చేశానంటున్న చంద్రబాబును చూసి ఇరిగేషన్ నిపుణులు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులు మళ్లీ వడ్డీలకు అప్పులు తెచ్చుకునే పరిస్థితి కల్పించనది చంద్రబాబేనని ధర్మాన విమర్శించారు.