'స్పీకర్ వైఫల్యంగానే భావిస్తున్నాం'
హైదరాబాద్: అసెంబ్లీ తొలి సమావేశం నుంచే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీలకు అతీతంగా వ్యవరించాల్సిన స్పీకర్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. శాసనసభ సమావేశాల్లో స్పీకర్ అవలంభిస్తున్న ఏక్షపక్ష ధోరణిని నిరసిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానంకు నోటీసు ఇచ్చిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలతో కలిసి సుజయకృష్ణ రంగారావు విలేకరులతో మాట్లాడారు.
స్పీకర్ గా కోడెల ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై గంటల తరబడి మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక అవాస్తవాలు మాట్లాడినా సభాపతి వారి కట్టడి చేయలేదన్నారు. గతంలో స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాలనుకున్నామని, తన వ్యవహార శైలిని మార్చుకుని సభను సక్రమంగా నడుపుతారని వెనక్కు తీసుకున్నామని వెల్లడించారు.
తమ ఎమ్మెల్యే ఆర్ కే రోజాకు ప్రధాన అంశంపై మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఆమెపై ఎదురుదాడి చేసి అన్యాయంగా ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారని వాపోయారు. అసెంబ్లీలో నిరసనలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయో చెప్పాల్సిన బాధ్యత స్పీకర్ ఉందన్నారు. అసెంబ్లీ ప్రాపర్టీ అయిన వీడియోలు సోషల్ మీడియాకు లీకవడం స్పీకర్ వైఫల్యంగానే భావిస్తున్నామన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేందుకు అవసరమైన సంఖ్యా బలం తమ పార్టీకి ఉందని సుజయకృష్ణ తెలిపారు.