స్విస్ ఛాలెంజ్ ఓ దోపిడీ | YSRCP nails Swiss Challenge method! | Sakshi
Sakshi News home page

స్విస్ ఛాలెంజ్ ఓ దోపిడీ

Published Sun, Jun 26 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

స్విస్ ఛాలెంజ్ ఓ దోపిడీ

స్విస్ ఛాలెంజ్ ఓ దోపిడీ

సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రయోజనాలకు హానికరమైన స్విస్ ఛాలెంజ్ విధానాన్ని రద్దు చేసి రాజధాని పనుల నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు పిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగపూర్ సంస్థలతో చేసుకుంటున్న ఈ ఒడంబడికలో పారదర్శకత లేదని, అది పూర్తిగా చీకటి ఒప్పందమని విమర్శించారు. వ్యక్తిగత స్వార్థం, దోపిడీ చేసే దురాలోచనతోనే ఈ విధానాన్ని సీఎం అమలు చేస్తున్నారన్నారు.

రాజధాని నిర్మాణాన్ని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ సంస్థలకు కట్టబెట్టాలని భావిస్తున్నామని, ఇది కాదని ఎవరైనా ముందుకు వస్తే కూడా పరిశీలిస్తామని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పిన తరువాత మరే సంస్థలైనా ముందుకు వస్తాయా? అని బొత్స సూటిగా ప్రశ్నించారు. స్విస్ విధానం ఎంత మాత్రం సరైనది కాదని పారదర్శకత ఉండదని, అమలు చేస్తే ప్రమాదమని 2015 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పేర్కొందన్నారు.

అలాగే ఏపీ మౌలిక సదుపాయాల శాక ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్ ఈ పద్ధతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేస్తూ వాటిని ఉల్లంఘించరాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విధానానికి వ్యతిరేకంగా ఉన్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చిన మాట వాస్తవం కాదా? అని ఆయన అన్నారు. కేంద్రం సహా అంతా వ్యతిరేకిస్తున్న ఆ లోపభూయిష్టమైన విధానాన్నే అమలు చేయాలని ఎందుకు బరితెగిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. దేశంలో రాజధాని నిర్మించేంతటి కంపెనీలున్నాయా అని సీఎం మాట్లాడ్డం అందరినీ అవమానించడమేనన్నారు.

రేపు ఎన్నికల అనంతరం మరో ప్రభుత్వం అధికారంలోకి వ చ్చి ఈ చీకటి ఒప్పందాలను రద్దు చేస్తే భారీగా పరిహారం చెల్లించాలని సింగపూర్ సంస్థలు కోరిన కోర్కెను మంత్రివర్గం  ఆమోదించారన్నారు. ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే ఇలాంటి ఒప్పందాలను వచ్చే ప్రభుత్వం రద్దు చేస్తే భారీ పరిహారం చెల్లించాలా? ఏం విడ్డూరం ఇది! రాష్ట్ర ప్రజలారా గమనించండి దీని వెనుక ఎంత దోపిడీ దాగి ఉందో... అని బొత్స అన్నారు. ప్రభుత్వం మారితే అన్న అనుమానం మంత్రివర్గ సభ్యులకు రావడం చూస్తే ఎన్నికల తరువాత ఈ ప్రభుత్వం ఉండదని వారే అంగీకరించిట్లని ఆయన అన్నారు. రాజధానిని అడ్డుకుంటున్నామని తమపై చేస్తున్న విమర్శల్లో నిజంలేదని, తాము అడ్డుకుంటున్నది రాజదాని నిర్మాణంలో సాగుతున్న అవినీతి, దోపిడీలనేనని బొత్స స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement