
జూలై 8న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ
ఏపీ మండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెల్లడి
- వైఎస్సార్ జయంతి సందర్భంగా విజయవాడలో ప్రారంభం
- తెలుగు రాష్ట్రాలకూ కలిపి జూలై 8, 9 తేదీల్లో సమావేశాలు
- మే చివరి వారంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు
- జూన్ 19, 20, 21 తేదీల్లో ఒక రోజు జిల్లా ప్లీనరీలు
- ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండా
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీన విజయవాడ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అవుతాయని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉంటాయని తెలిపారు. పార్టీ ప్లీనరీ సమావేశాలను మొత్తం మూడంచెలుగా నిర్వహించబోతున్నామని... తొలుత నియోజకవర్గ స్థాయి, రెండో విడతగా జిల్లా స్థాయి, మూడో విడతగా జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మే చివరి వారంలో శాసనసభా నియోజకవర్గ స్థాయిలో అక్కడి నాయకత్వానికి వీలును బట్టి ఏదో ఒక రోజు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. ఇక జూన్ 19, 20, 21 తేదీల్లో ఆయా జిల్లాల్లో వీలును బట్టి వీటిలో ఏదో ఒక రోజు జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలు ఉంటాయని చెప్పారు. విజయవాడలో జరిగే ప్లీనరీ సమావేశాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు, కార్డులు, అనేక ఇతర స్థానిక సమస్యలపై నేతలు చర్చించి తీర్మానాలు చేస్తారన్నారు. నియోజవర్గ సమావేశాల నుంచి వచ్చే తీర్మానాల ఆధారంగా జిల్లా స్థాయి ప్లీనరీల్లో చర్చలు జరుగుతాయని తెలిపారు. జిల్లా స్థాయి ప్లీనరీల్లో ఆయా సమస్యలపై చర్చించి చేసిన తీర్మానాలను వెంటనే కేంద్ర కార్యాలయానికి పంపాలని ఆయన సూచించారు.
13 వేల మంది ప్రతినిధులు... అధ్యక్షుడి ఎన్నిక
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి నిర్వహిస్తున్న ప్లీనరీలో 13 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని ఉమ్మారెడ్డి తెలిపారు. ఏపీలో 13 జిల్లాలే ఉన్నాయి కనుక ప్లీనరీలు విడివిడిగా జరుపుకుంటారని, తెలంగాణలో 31 జిల్లాలున్నాయి కనుక హైదరాబాద్‌లోనే అన్ని జిల్లాల సమావేశాలు నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తారన్నారు. విజయవాడ ప్లీనరీలో పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కమిటీలు కూడా ఏర్పాటవుతాయని చెప్పారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు భోజన వసతి, మంచినీటి వసతి, సభా వేదిక తదితర సౌకర్యాల ఏర్పాట్ల కోసం కమిటీలను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. వచ్చే ఏడాది పోలింగ్ బూత్ స్థాయి నుంచీ కమిటీలు వేసి, పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఉమ్మారెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.