
టోక్యో(జపాన్): జపాన్ తీరంలో సరుకు రవాణా నౌక మునిగిన ఘటనలో పది మంది భారతీయులు కనిపించకుండాపోయారు. హాంగ్‌కాంగ్‌లో రిజిస్టరయిన 33వేల టన్నుల ఎమరాల్డ్‌స్టార్ అనే సరుకు రవాణా నౌక శుక్రవారం తెల్లవారుజామున ఒకినావ సమీపంలో మునిగిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న జపాన్ కోస్టుగార్డులు వెంటనే సంఘటన స్థలికి చేరుకున్నారు.
ఓడలోని 26 మంది భారతీయ సిబ్బందిలో 16మందిని మాత్రం రక్షించగలిగారు. అయితే, బలమైన టైఫూన్ తుఫాను కారణంగా వెంటనే రక్షణ చర్యలకు అంతరాయం ఏర్పడింది. మిగతా 10 మంది జాడ కోసం గాలింపు కొనసాగుతోంది. మృతులు, బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.