లిబియా రాజధాని ట్రిపోలీలోని ట్యునీషియా రాయబార కార్యాలయం (ఫైల్)
ట్యూనిస్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతోన్న లిబియాలో మరో సంచలనం చోటుచేసుకుంది. రాజధాని ట్రిపోలీలోని ట్యునీషియా రాయబార కార్యాలయంపై సాయుధ ఉగ్రవాదులు దాడి జరిపి 10 మంది అధికారులను అపహరించుకు వెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన ట్యునీషియా ప్రభుత్వం.. బందీలను విడిపించే దిశగా చర్యలు చేపట్టాల్సిందిగా లిబియా ఉన్నతాధికారులను కోరారు.
అయితే లిబియా అధికారులు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదని, ఇలాంటి అపహరణలు మరిన్ని జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజధాని ట్రిపోలీ సహా లిబియాలో ఉన్న తమ దేశస్తులందూ వెంటనే వెనక్కు రావాలని ఆదేశించినట్లు ట్యునీషియా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 2011లో గడాఫీ మరణానంతరం తలెత్తిన ఆధిపత్య పోరు లిబియాను అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఆసుపత్రులు, స్కూలు భవనాలను నేలకూల్చిన తిరుగుబాటుదారులు తాజాగా రాయబార కార్యాలయాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలిసింది.