
రేపిస్ట్ కాల్పుల కలకలం.. 11 మంది మృతి
మెక్సికో: కొందరు ఉన్మాదులు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది చనిపోయారు. సెంట్రల్ మెక్సికోలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ రేపిస్ట్ సహా మరో వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. స్థానిక మేయర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఓ కుటుంబంపై కక్షగట్టిన వ్యక్తి, మరోకరితో కలిసి సాయుధులుగా ఇంట్లోకి ప్రేవేశించి కాల్పులు జరిపి 11 మందిని హతమార్చారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, నలుగురు మగవాళ్లు ఉన్నారు. మరో ఇద్దరు చిన్నారులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం వారిని తెహ్యూకన్లోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
కాల్పులు జరిపినప్పుడు ప్రత్యక్షంగా చూసిన ఐదుగురు వ్యక్తులు ప్రభుత్వ అధికారుల సంరక్షణలో ఉన్నారు. కాల్పులు జరిపిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలతో ఇద్దరు నిందితులను గుర్తించామని, చనిపోయిన మహిళల్లో ఒకరిని నిందితులలో ఒకడు గతంలో రేప్ చేశాడని తెలిపారు. అత్యాచారం విషయంపై నిందితుడితో ఆ కుటుంబానికి తగాదాలున్నాయని, ఈ నేపథ్యంలోనే ఆ ఇంట్లో ఉన్న వాళ్లను హత్యచేశారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.