విషాదానికి దారి తీసిన 'జకాత్'
ఢాకా: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు నిర్వహించే జకాత్ విషాదానికి దారి తీసింది. బంగ్లాదేశ్లోని మైమెన్ నగరంలో శుక్రవారం నిర్వహించిన జకాత్లో జరిగిన తొక్కిసలాటలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో యాభైమంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ప్రతి ముస్లిం తన సంవత్సరిక ఆదాయంలో కొంత భాగాన్ని పేదలకు, ఆపదలో ఉన్నవారిని దానం చేయడం ఆనవాయితీ. దీన్నే జకాత్ అని వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో స్థానికంగా అవసరం ఉన్నవారికి లేదా పేదవారికి బట్టలు పంపిణీ చేస్తుండగా ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. దీంతో ఈ విషాదం చోటు చేసుకుంది. గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
కాగా ఇస్లాం ఐదు మూలస్తంభాలలో నాలుగోది జకాత్. దీనినే "శుద్ధి" అని కూడా అంటారు. అంటే తన ఆదాయాన్ని శుద్ధి చేసుకోవడం, అనగా తన ఆదాయంలో కొంత భాగాన్ని పేదలకు పంచాలి, లేదా సాయం చేయాలి . ఈధార్మిక విధానాన్ని జకాత్ అంటారు. ఈ జకాత్ను రంజాన్ మాసంలో లెక్కగట్టి చెల్లిస్తారు.