ఇండోనేషియాలో సునామి ప్రభావానికి నేలమట్టమైన నివాస సమాదాయాలు
ఇండోనేసియాను మరో జల విలయం ముంచెత్తింది. ప్రకృతి ప్రకోపాలకు తరచూ గురయ్యే ఈ ద్వీప సముదాయ దేశంలో తాజాగా ఓ సునామీ మృత్యు పాశమై పెను విధ్వంసం సృష్టించింది. శినివారం రాత్రి సముద్ర గర్భంలోని ఒక అగ్ని పర్వతం బద్ధలై.. సుమత్ర, జావా ద్వీపాల తీరాలపై సునామీగా విరుచుకుపడింది. సముద్రం నుంచి దూసుకొచ్చిన మృత్యు అలలు క్షణాల్లో 222 మందిని బలి తీసుకున్నాయి. మరెంతో మందిని గాయాలపాలు చేశాయి. బలమైన అలల తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి.
కెరీటా
ఇండోనేసియాలో మరో భారీ ప్రకృతి విలయం సంభవించింది. సముద్రంలో, తీరానికి దగ్గరగా ఉన్న ఒక అగ్నిపర్వతం పేలిన కారణంగా సునామీ రావడంతో 222 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది క్షతగాత్రులుగా మారారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. సుమత్రా, జావా ద్వీపాల మధ్యనున్న సుండా జలసంధిలోని చిన్న దీవిలో ఉన్న ఆనక్ క్రకటోవా అనే అగ్ని పర్వతం పేలిన కారణంగా స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9.30 గంటలకు (భారత కాలమానంలో శనివారం రాత్రి 8 గంటలు) సునామీ సంభవించింది. సుమత్రా దీవి దక్షిణ తీరం, జావా దీవి పశ్చిమ తీరాలపై ఈ సునామీ విరుచుకుపడి తీవ్ర విధ్వంసం సృష్టించింది.సాధారణంగా అగ్నిపర్వతాల కారణంగా వచ్చే సునామీలు చాలా అకస్మాత్తుగా, ఉన్నట్టుండి తీరాలను ముంచెత్తుతాయి. దీంతో ప్రజలను సురక్షిత తరలించేంత తరలించేంత సమయం ఉండదు. అగ్ని పర్వతాలు పేలిన కారణంగా సునామీలు చాలా అరుదుగా వస్తుంటాయని అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం తెలిపింది. కాగా, ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాల్లో ఇండోనేసియాకు సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ‘ఇండోనేసియాలో సునామీ కారణంగా జరిగిన విధ్వంసం గురించి తెలుసుకుని చింతిస్తున్నాను. చనిపోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఐరోపా దేశాల నేతలు ఇండోనేసియాకు సానుభూతి తెలిపారు.
సెవెంటీన్ పాప్ గ్రూప్‌పై..
శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చేపడుతున్నామనీ, మొత్తంగా 28 మంది గల్లంతయ్యారని ఇండోనేసియా జాతీయ ప్రకృతి విపత్తుల స్పందన సంస్థ అధికార ప్రతినిధి సుటొపో పుర్వో నుగ్రొహో చెప్పారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం సునామీ కారణంగా 222 మంది మరణించగా, మరో 843 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చన్నారు. సుండా జలసంధి సమీపంలోని తీరాల్లో, జావా ద్వీపంలోని పాండెగ్లాంగ్ జిల్లాలో 163 మంది చనిపోయారనీ, అత్యధిక మరణాలు రెండు హోటళ్లలో సంభవించాయని నుగ్రోహో చెప్పారు.
సెరంగ్‌లో 11 మంది, సుమత్రా దీవిలోని దక్షిన లంపుంగ్‌లో 48 మంది చనిపోయారన్నారు. ఈ సునామీకి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వెలువడిన ఓ వీడియో భీతి గొల్పేలా ఉంది. ‘సెవెంటీన్’ అనే పాప్ గ్రూప్ ప్రదర్శన ఇస్తుండగా, భారీ ఎత్తున్న నీటి అల వెనుకవైపు నుంచి వేదిక మీదకు వచ్చి పడింది. వేదికపైనున్న కళాకారులు చెల్లాచెదురయ్యారు. అనంతరం అల ప్రేక్షకులను ముంచెత్తింది. సునామీ కారణంగా వందలాది చెట్లు, విద్యుత్ స్తంభా లు నేలకూలాయి. శిథిలాలు, చెత్త, చెదారమంతా బీచ్‌ల్లోకి చేరింది.
జావా ద్వీపంలోని కెరీటా బీచ్‌లోకి ఓ ఇంటి పైకప్పుకు అమర్చిన రేకులు, మొద్దులు, ఇతర శిథిలాలు కొట్టుకొచ్చాయి. సునామీ సమయంలో అగ్ని పర్వతం ఫొటోలు తీస్తున్న ఓయ్‌స్టీన్ అండర్సన్ తన అనుభవాన్ని వివరిస్తూ ‘అకస్మాత్తుగా ఓ పెద్ద అల వచ్చింది. అది తీరం దాటి దాదాపు 20 మీటర్లు ముందుకొచ్చింది. నేను పరుగెత్తడం మొదలుపెట్టాను. ఆ తర్వాత వచ్చిన అల తీరంలోని హోటల్ ప్రాంతాన్ని ముంచేసింది. కార్లు, కంటెయినర్లు 10 మీటర్లకు పైగా దూరం కొట్టుకుపోయాయి’ అని చెప్పారు.
మొత్తం మృతుల సంఖ్య అప్పుడే చెప్పలేం
సునామీ మృతుల సంఖ్య స్పష్టంగా తెలిసేందుకు కొన్ని రోజులు లేదా వారాలు పట్టొచ్చని రెడ్ క్రాస్, రెడ్ క్రీసెంట్ సొసైటీస్ అంతర్జాతీయ సమాఖ్యకు చెందిన కేథీ ముల్లర్ తెలిపారు. శిథిలాలను పూర్తిగా తొలగించేంత వరకు మృతుల సంఖ్య ఎంతో కచ్చితంగా చెప్పలేమనీ, రాబోయే కొన్ని రోజులు, వారాల పాటు ఈ సంఖ్య మారుతూ ఉంటుందని ఆమె అన్నారు. సహాయక బృందాలు గాయపడిన వారిని వైద్యశాలలకు తరలిస్తున్నాయి. తమ సంస్థల తరఫున సహాయక శిబిరాలు నెలకొల్పి ప్రజలకు తాత్కాలిక వసతిని, ఆహారాన్ని అందజేస్తున్నట్లు కేథీ చెప్పారు.
సునామీ కారణంగా వచ్చే వ్యాధులను ఎదుర్కొనేందుకు, జబ్బులు రాకుండా నివారించేందుకు తమ బృందాలు సిద్ధమవుతున్నాయన్నారు. కాగా, ఇండోనేసియాలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగానే సంభవిస్తుంటాయి. ఈ ఏడాదే సెప్టెంబర్ నెలలోనూ సులవేసి ద్వీపంలోని పలూ పట్టణంలో సునామీ వచ్చి వేలాది మంది చనిపోయారు. 2004 డిసెంబర్ 26న రిక్టర్ స్కేల్‌పై 9.3 తీవ్రతతో సముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా సునామీ సంభవించి వివిధ దేశాల్లో మొత్తంగా 2.2 లక్షల మంది చనిపోగా, వారిలో ఇండోనేసియా ప్రజలే 1.68 లక్షలు ఉన్నారు.
పేలిన అగ్నిపర్వతం
సుమత్రా, జావా ద్వీపాల మధ్యలో పేలిన ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం
వీధి విధ్వంసం
సునామీలో పూర్తిగా ధ్వంసమైన వీధి, వాహనాలు
శవాల దిబ్బ
కవర్లలో చుట్టిన మృతదేహాల్లో తమ వారి కోసం వెతుకుతున్న ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment