ఈజిప్టులో కాల్పుల కలకలం... 34 మంది మృతి
కైరో: ఈజిప్టులో మిలిటెంట్లు మరోసారి విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో ఆర్మీ సిబ్బంది ఎదురుకాల్పులు జరిపింది. అయితే కనీపం 30 మంది మిలిటెంట్లు, నలుగురు సిబ్బంది మృతిచెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈజిప్టులోని ఉత్తర సినాయ్ సరిహద్దులోని షేక్ జువైద్ చెక్ పోస్ట్ లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు గురువారం అర్ధరాత్రి కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ సిబ్బంది ఎదురుకాల్పులకు దిగింది. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ సిబ్బంది చనిపోగా, 30 మంది మిలిటెంట్లు హతమయ్యారని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. కాల్పుల ఘటనలో మొత్తంగా ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు.
అంతర్జాతీయ తీర సరిహద్దుగల అబు రాఫేయ్ షేక్ జవైద్ నగరం గుండా వెళ్తోంది. దీంతో మిలిటెంట్లు తమ అవసరార్థం ఆ చుట్టుప్రక్కల గ్రామస్తులను అక్కడి నుంచి పంపించివేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దాడి జరిగినరోజు అరిష్ నగరంలో ఓ స్కూలు సమీపంలో బాంబును నిర్వీర్యం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ఈజిప్టులో 2013 జూలై నుంచి కొనసాగుతున్నాయి. దీంతో వేల మంది పోలీసులు, ఆర్మీ సిబ్బంది, సామాన్యులు ఉగ్రమూకల చర్యలతో బలవుతూనే ఉన్నారు.