సిరియా అంతర్యుద్ధంలో 4.7 లక్షల మంది మృతి
సిరియాలో అంతర్యుద్ధం కారణంగా గత ఐదేళ్లలో 4.7 లక్షల మంది మరణించారు. 4 లక్షల మంది సిరియన్లు దాడుల్లో చనిపోగా, మరో 70 వేల మంది స్వచ్ఛమైన తాగునీరు, వైద్యం అందక ప్రాణాలు కోల్పోయినట్టు గార్డియన్ పత్రిక వెల్లడించింది. ఆ దేశ జనాభాలో 11 శాతం మందికిపైగా గాయపడినట్టు పేర్కొంది.
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు అమెరికా సారథ్యంలోని సేనలు ప్రయత్నించడంతో పాటు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటున్నాయి. కాగా రష్యా, ఇరాన్లు అసద్కు మద్దతుగా నిలిచాయి. అసద్ను వ్యతిరేకులను వ్యతిరేకిస్తున్నాయి. సిరియా బలగాలకు మద్దతుగా రష్యా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఉగ్రవాదులతో పాటు సామాన్యులు కూడా మృత్యువాత పడుతున్నారు. కాగా సౌదీ అరేబియా వంటి అరబ్ దేశాలు అసద్కు మద్దతు ఇస్తున్నాయి.
సైనిక దళాలు, ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న దాడుల వల్ల సిరియా తీవ్రంగా నష్టపోతోంది. లక్షలాదిమంది మరణించడంతో పాటు ఆర్థికంగా అపార నష్టం వాటిల్లుతోంది. ఇక దాడుల్లో 19 లక్షల మంది గాయపడ్డారు. సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమని రష్యా ప్రకటించింది.