బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో గురువారం జరిగిన కారు బాంబు పేలుడులో 51 మంది మృతిచెందారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ బాగ్దాద్‌లోని మార్కెట్‌లోకి ఓ కారు వేగంగా దూసుకొచ్చి వెంటనే పేలిపోయింది. ఈ మార్కెట్‌లో పెద్దసంఖ్యలో గుమిగూడి ఉన్న షియా ముస్లింలు లక్ష్యంగానే ఈ దాడి జరిగింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. పేలుడు జరగగానే మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డట్లు, తీవ్రమైన విధ్వంసం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టమైంది. ‘బయాలోని కారు డీలర్‌షిప్ సమీపంలో ఉగ్రదాడి జరిగింది. 51 మంది చనిపోయారు. ప్రమాద తీవ్రత ఆధారంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది’ అని ఇరాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మంగళవారం కూడా ఇదే ప్రాంతంలో.. ఇదే పద్ధతిలో జరిగిన (కారుతో మార్కెట్‌లోకి దూసుకొచ్చారు) ఉగ్రదాడిలో నలుగురు మృతిచెందారు. బాగ్దాద్ ఉత్తర ప్రాంతంలో బుధవారం జరిగిన దాడిలో 11 మంది పౌరులు మృతిచెందినట్లు ఐసిస్ ఓ ప్రకటనలో తెలిపింది. 2017 ఆరంభం నుంచీ బాగ్దాద్‌లో తరచూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. కాగా, ఈ ఘటనకు తమదే బాధ్యతంటూ ఐసిస్ అనుబంధ సంస్థ ‘ద అమాక్ ప్రాపగాండా ఏజెన్సీ’ ప్రకటించింది.
అఫ్గాన్ లో బాంబు పేలి 12 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ లోని పక్తిక ప్రావిన్సులో ఉగ్రవాదులు రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలి 12 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు విద్యార్థులున్నారు. మృతులంతా ఒక వాహనంలో ప్రయాణిస్తుండగా, బాంబు సమీపానికి వాహనం రాగానే పేలిపోయింది. ఈ తరహా బాంబు దాడులకు పాల్పడే తాలిబన్ లే ప్రస్తుత బాంబును కూడా అమర్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.