లిబియా ఉత్తర జలల్లో కాపాడిన వలసదారులను తీసుకొస్తున్న దృశ్యం
రోమ్: మధ్యధరా సముద్రంలో ఘోర ప్రమాదం! వలసదారులతో కిక్కిరిసిన పడవ శనివారం రాత్రి లిబియా ఉత్తర జలాల్లో మునిగిపోయింది. పడవలోని 700 మందికిపైగా మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. ఇటలీ తీర గస్తీ సిబ్బంది ఆదివారం సాయంత్రానికి 24 మృతదేహాలను వెలికితీసి, 28 మంది ప్రయాణికులను రక్షించారు. గల్లంతైన వారంతా మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. 20 మీటర్ల పొడవున్న ఈ పడవలోని ప్రయాణికులు.. పోర్చుగీసు వాణిజ్యనౌక దగ్గరగా వస్తుండడంతో దాని దృష్టిని ఆకర్షించేందుకు ఒక పక్కకు ఒరిగారని, దీంతో పడవ బోల్తాపడి ఉంటుందని ఇటలీ కోస్ట్ గార్డ్ ఓ ప్రకటనలో తెలిపింది.
‘పడవ కిక్కిరిసి ఉండడంతో ప్రయాణికులు సాయం కోసం ఎదురు చూశారు. పోర్చుగీసు నౌకకు కనిపించాలనుకున్నారు’ అని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బార్బరా మోలినారియో చెప్పారు. మధ్యధరా సముద్రంలో వలసదారుల పడవలు మునగడం ఈ వారంలో ఇది మూడోసారి.