ఎముకలు కొరికే చలిలో.. రెండేళ్లు! | Ada Blackjack: A True Story of Survival in the Arctic | Sakshi
Sakshi News home page

ఎముకలు కొరికే చలిలో.. రెండేళ్లు!

Published Wed, Nov 16 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM

ఎముకలు కొరికే చలిలో.. రెండేళ్లు!

కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్‌ లాంటి చల్లని ప్రదేశాలకు వెళ్తే కొద్ది సేపటికే గజగజా వణికిపోతాం. అలాంటిది ఆర్కిటిక్‌ లాంటి ధ్రువ ప్రాంతంలోకి సాహసయాత్రకు వెళ్తే..? ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయి ఒంటరిగా జీవించాల్సి వస్తే..? వెంట తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోవస్తే..? రెండేళ్ల పాటు ఎముకలు కొరికే చలిలో ధ్రువపు ఎలుగుబంట్ల కంటపడకుండా బతకాల్సి వస్తే..? తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ..? ‘అడా బ్లాక్‌జాక్‌’ మాత్రం స్వయంగా ఇవన్నీ అనుభవించింది. అంతేనా.. ప్రాణాలతో బయటపడి, విధితో పోరులో విజేతగా నిలిచింది. కానీ, ప్రపంచమే ఆమె పోరాటాన్ని గుర్తించలేదు..!

1921 నాటి సంగతి.. ప్రఖ్యాత కెనడియన్ శాస్త్రవేత్త, ఆర్కిటిక్‌ అన్వేషకుడు ‘విల్జామర్‌ స్టెపాన్సన్’ ఓ బ్రహ్మాండమైన సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. అలాస్కా నుంచి చుక్చీ సముద్రం మీదుగా రష్యాలోని రాంగెల్‌ దీవికి చేరుకోవాలనేదే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. ఆర్కిటిక్‌లోని మంచు సముద్రాల మీదుగా వందల మైళ్ల దూరం కాలినడకన చేయాల్సిన ఈ ప్రయాణాన్ని సాహస యాత్ర అనడం కంటే.. అన్వేషణ యాత్ర అనడమే సబబు. స్టెపాన్సన్ ఈ యాత్ర కోసం కెనడాకే చెందిన అల్లాన్ క్రాఫార్డ్‌ను నాయకుడిగా ఎన్నుకున్నారు. మరో ముగ్గురు అమెరికన్లు లార్నే నైట్, మిల్టన్ గాల్లే, ఫ్రెడ్‌ మారెర్‌లను బృంద సభ్యులుగా ఎంపిక చేశారు. వీరందరికీ గతంలో ఇటువంటి సాహస యాత్రలు చేసిన అనుభవం ఉంది. వీరికి తోడుగా అలాస్కాకు చెందిన ఇన్యూట్‌ తెగ మహిళను వంటమనిషిగా ఎంపిక చేశారు. కుట్టుపని కూడా బాగా తెలిసిన ఆ మహిళే.. 23 ఏళ్ల అడా బ్లాక్‌జాక్‌. వీరంతా కలిసి జీతం ప్రాతిపదికన ఈ అన్వేషణ యాత్రకు సిద్ధమయ్యారు.

రాంగెల్‌ దీవిని కెనడా భూభాగంగా చాటుకోవడమే ప్రధానంగా సాగిన ఈ ప్రయాణానికి స్టెపాన్సన్ ఆర్థిక అండదండలు అందించాడు. అయితే, ఆయన మాత్రం యాత్రకు దూరంగా ఉన్నారు. 1921, సెప్టెంబర్‌ 16న వీరి యాత్ర ప్రారంభమైంది. కొన్ని రోజులు ప్రయాణం బాగానే సాగింది. కానీ, మంచుతో గడ్డకట్టిన చుక్చీ సముద్రంపై నడుస్తున్న కొద్దీ వీరి శరీరాల్లో విపరీతమైన మార్పులు రాసాగాయి. అక్కడక్కడా ఆగుతూ, ఎలాగో ముందుకు సాగిపోయారు. అలా కనీవినీ ఎరుగని రీతితో దాదాపు ఏడాదిన్నర పాటు వీరి ప్రయాణం సాగుతూనే ఉంది. కొద్ది వారాలకు పరిస్థితులు ప్రతికూలంగా మారడం మొదలుపెట్టాయి. వెంట తెచ్చుకున్న సరకులు అయిపోయాయి. చేరాల్సిన గమ్యం అప్పటికి ఇంకా చాలా దూరాన ఉండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి చేరుకున్నారు బృంద సభ్యులు. కొద్ది వారాల పాటు సీల్‌ చేపలను వేటాడటం లాంటి పనులు చేసి ఎలాగో ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఇక, ప్రయాణం ఎక్కువ కాలం సాగదని తెలిసి సహాయం, ఆహారం కోసం సైబీరియా ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు మిల్టన్ గాల్లె, మారెర్, క్రాఫార్డ్‌లు. అప్పటికే జబ్బు బారిన పడిన లార్నే నైట్‌కు తోడుగా బ్లాక్‌జాక్‌ను అక్కడే విడిచిపెట్టి 1923 జనవరి 28న ప్రయాణం సాగించారు. అలా 700 మైళ్ల దూరం ప్రయాణించి సైబీరియా ప్రాంతానికి చేరుకున్నారు.

మరోవైపు మంచు కొండల్లో అష్టకష్టాలు పడ్డారు నైట్, బ్లాక్‌జాక్‌లు. నైట్‌ ఆరోగ్యం దెబ్బతినడంతో ఆయనకు సపర్యలు చేస్తూ, సీల్‌లను వేటాడుతూ ఆహారం సంపాదించసాగింది బ్లాక్‌జాక్‌. రోజురోజుకీ క్షీణిస్తూ వస్తోన్న నైట్‌ను ఓవైపు కాపాడుతూనే, ప్రమాదకరమైన ధ్రువపు ఎలుగుబంట్ల కంట పడకుండా తనను తాను రక్షించుకునేది. అయితే, ఎంత శ్రమించినా చివరకు ఏప్రిల్‌ నెలలో నైట్‌ను కోల్పోక తప్పలేదు ఆమెకి. అతడు విగతజీవిగా పడి ఉండటం గమనించి, అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయాణం మొదలుపెట్టింది. ఒంటరిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ, అప్పటికే మంచు ప్రాంతంలో ఎలా జీవించాలో ఒంటబట్టించుకోవడంతో ప్రాణాలు నిలబెట్టుకోగలిగింది. చివరకు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య బ్లాక్‌జాక్‌ను ఆగస్టు 19న కనుగొన్నారు కొందరు నావికులు. అలా తిరిగి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

అత్యంత వీరోచితంగా బతుకుపోరాటం చేసిన ఆమెకు ఈరోజుల్లో అయితే ఘన స్వాగతం లభించి ఉండేది. కానీ, అప్పట్లో అలా జరగలేదు. మీడియా బ్లాక్‌జాక్‌ను రాక్షసిలా చూసింది. తోటి అన్వేషకుడి మరణానికి ఆమే కారణం అని ఆరోపించింది. మరణించిన నైట్‌ కుటుంబ సభ్యులు కూడా ఆమె తీరును తప్పుపట్టారు. ఆమె నైట్‌ను విడిచిపెట్టేసి వచ్చిందని ప్రజల్లో బలమైన నమ్మకాలు పాతుకుపోయాయి. అయితే, అదంతా అసత్యమని తర్వాత ఆమెను కలిసిన ముగ్గురు సహ అన్వేషకులు ప్రకటించినా ప్రయోజనం లేకపోయింది. ఆమె సమాజం దృష్టిలో విలన్గానే నిలిచిపోయింది. ఆమె జీవిత కథ ఆధారంగా తర్వాత ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. సినిమాలు సైతం రూపొందాయి. కానీ, ఏవీ ఆమెకు మేలు చేయలేకపోయాయి. జీవితాంతం ఆమె పేదరికంలోనే మగ్గిపోయింది. చివరకు ఆర్కిటిక్‌ ప్రాంతంలోని ఓ శరణాలయంలోనే 85 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement