
తలకు తల ప్రతీకారం.. 8 మందిని నరికేశారు
కాబూల్: అఫ్ఘానిస్తాన్ సైన్యం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల తరహాలో ప్రతీకారం తీర్చుకుంది. గత శనివారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నలుగురు సైనికుల తలలను నరికివేయగా, అదో రోజు అఫ్ఘాన్ సైన్యం నలుగురు ఐఎస్ ఉగ్రవాదులను తలలను నరికివేసి ప్రతీకారం తీర్చుకుంది. అప్ఘాన్లోని నంగార్మర్ ప్రావిన్స్లో ఈ ఘటన జరిగింది. ఈ ఎనిమిది మంది ఐఎస్, అఫ్ఘాన్ సైన్యం మధ్య పరస్పర దాడుల్లో బందీలుగా చిక్కారు. ఐఎస్ ఉగ్రవాదులకు నలుగురు సైనికులు బందీలుగా దొరకగా, అఫ్ఘాన్ సైనికులకు నలుగురు ఐఎస్ ఉగ్రవాదులను బందించింది. ఐఎస్ ఉగ్రవాదులు సైనికుల తలలను నరికివేశారని తెలియగానే, అప్ఘాన్ సైన్యం అదే తరహాలో ప్రతీకారం తీర్చుకుంది. నంగార్మర్ ప్రావిన్స్లో అచిన్ జిల్లా గవర్నర్ గలిబ్ ముజాహిబ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అఫ్ఘాన్ సైన్యం నరికివేసిన ఐఎస్ ఉగ్రవాదుల తలలను ఓ ప్రధాన రోడ్డు పక్కన ఉంచింది. రోడ్డు పక్కన రాళ్లను ఒకదానిపై మరొకటి ఉంచి స్తంభాల్లో పేర్చి.. వాటిపై ఉగ్రవాదుల తలలను ప్రదర్శించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను హతమారుస్తామని, అఫ్ఘాన్ సైనికులు తుపాకీలు పైకెత్తి నినాదాలు చేశారు.