ఆఫ్రికాపై ‘ఎబోలా’ కోరలు..
వైరస్‌తో మూడు దేశాల్లో 932 మంది మృత్యువాత
వైరస్ ప్రభావిత దేశాల నుంచివచ్చేవారికి వైద్య పరీక్షలు
నాలుగు వారాలపాటుపర్యవేక్షణకూ భారత్ నిర్ణయం
న్యూఢిల్లీ: పశ్చిమాఫ్రికాలోని సియెర్రా లియోన్, లైబీరియా, గినియా, నైజీరియా దేశాల్లో భయానకంగా పరిణమించిన ఎబోలా వైరస్ బారినపడి గత మూడురోజుల్లోనే 932 మంది మత్యువాతపడటంతో ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల వద్ద క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని భారత్ నిర్ణయిం చింది. ఎబోలా ప్రభావిత దేశాల్లో ఇప్పటిదాకా 1,711 మంది వైరస్ బారిన పడిన నేపథ్యంలో అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం నైజీరియాలో 40 వేల మంది, మిగతా దేశాల్లో మరో 5 వేల మంది భారతీయులు ఉన్నారని, పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చితే వారు వెనక్కి వచ్చే అవకాశముందని ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ బుధవారం పార్లమెంటుకు తెలిపారు.
వైరస్‌బారిన పడిన రిపబ్లిక్ ఆఫ్ గినియా, లైబీరియా, సియెర్రా లియోన్‌లకు ఔషధాల కొనుగోలుకు రూ.30 లక్షల చొప్పున సాయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆమోదించారని హర్షవర్ధన్ చెప్పారు. భారత్‌కు ఈ వైరస్ ముప్పు తక్కువగానే ఉన్నా.. అన్నిరకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నాలుగు వారాల పాటు పర్యవేక్షించనున్నట్లు కూడా తెలిపారు. వైరస్ ప్రబలిన దేశాలలో వైరస్‌ను అరికట్టేందుకు ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు రూ.1,500 కోట్ల తక్షణ సాయం ప్రకటించాయి. ప్రాణాంతకమైన ఈ వైరస్‌కు సరైన చికిత్స సైతం లేకపోవడంతో భారత్ సహా అనేక దేశాల్లో ఇప్పుడు గగ్గోలు పుడుతోంది.
నివారణ.. కుటుంబసభ్యులు, వైద్యులు, అంత్యక్రియలు చేసేవారికే సంక్రమించే ప్రమాదం ఎక్కువ. గ్లౌవ్స్, ముక్కు, నోరుకు ముసుగు, కళ్లద్దాలు, ఒంటినిండా వస్త్రాలను ధరిస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు.
చికిత్స.. ఇప్పటిదాకా ప్రామాణిక చికిత్స లేదు. రోగిని ఒంటరిగా ఉంచడం, ద్రవాలు, ఆక్సిజన్ ఎక్కించడం, ఇతర ఇన్‌ఫెక్షన్లకు చికిత్సతోప్రాణాలు కాపాడే అవకాశం కొద్దిగా ఉంటుంది. అయితే లైబీరియాలో ఎబోలా బాధితులకు చికిత్స చేస్తున్న ఇద్దరు అమెరికా వైద్యులకు వైరస్ సోకిందని, వారికి ‘జడ్ మాప్’ అనే రహస్య ఔషధాన్ని ఇవ్వగా ప్రాణాపాయం తప్పిందని చెబుతున్నారు. కానీ ఈ ఔషధం గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
► ప్రాణాంతకం.. ఎబోలా వైరస్
► మనిషికి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లలో ఒకటి
► మొదటిసారిగా కాంగోలోని ఎబోలా నది సమీపంలో 1976లో కనిపించింది.
► అందుకే దీనికి ఎబోలా అని పేరుపెట్టారు.
► వీటిలో ఐదు రకాలు ఉండగా మూడు చాలా ప్రమాదకరమైనవి
► 100 మందికి సోకితే దాదాపు 90 మంది చనిపోతారు
► 1979 నుంచి ఇప్పటిదాకా 2,200 మందికి సంక్రమించగా.. 1,500 మంది చనిపోయారు
► గబ్బిలాల ద్వారా ఇది జంతువులకు, జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది.
మనుషులపై ప్రభావం ఇలా...
సంక్రమణ: రోగి రక్తం, మలమూత్రాలు, చెమట, ఇతర శరీర ద్రవాలు అంటిన సూదులు, కలుషిత మాంసంతో సంక్రమిస్తుంది.
మొదటిదశలో: జ్వరం, తలనొప్పి, కీళ్లు, గొంతు నొప్పి, బలహీనత, తీవ్ర అలసట వస్తాయి.
రెండోదశలో: వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు.
మూడోదశలో: వైరస్ దాడివల్ల కాలేయం, మూత్రపిండాలు విఫలమవుతాయి. శరీరంపై మచ్చలు, బొబ్బలు ఏర్పడతాయి. శరీరంలో అంతర్గత, బహిర్గత రక్తస్రావం మొదలై చివరికి రోగి చనిపోతాడు. ఈ మూడుదశలూ 2-21 రోజుల వ్యవధిలో జరిగిపోతాయి. 50-90% మంది 10 రోజుల్లోనే చనిపోతారు.
► ఎబోలా వైరస్ సహజ అతిథేయులు గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్)
► 1979 నుంచి మనుషులకు వైరస్ వ్యాపించిన ప్రాంతాలు
► జంతువుల్లో వైరస్ క నిపించిన ప్రాంతాలు
► ప్రస్తుతం వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న దేశాలు గినియా, లైబీరియా, సియెర్రా లియోన్