
న్యూయార్క్ : కశ్మీర్ అంశంలో భారత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న పాకిస్తాన్ తొలుత ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని అమెరికా సూచించింది. భారత్‌తో శాంతి చర్చలు కోరుకుంటున్న విషయం వాస్తమే అయితే అందుకు తగ్గట్టుగా ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 74వ సెషన్‌లో భాగంగా అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయక కార్యదర్శి అలైస్ వెల్స్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కశ్మీర్ విషయంలో దాయాది దేశాల సామరస్యపూర్వక చర్చలు జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అణ్వాయుధ దేశాలైన భారత్, పాకిస్తాన్ చర్చల ద్వారానే సమస్యకు ముగింపు పలికితే బాగుంటుందన్నారు.
‘ కశ్మీర్ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని కోరబోమని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక పాకిస్తాన్ మాత్రం కశ్మీర్ అంశంలో మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే పాకిస్తాన్ తొలుత ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఐక్యరాజ్యసమితిచే అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రపడిన హఫీజ్ సయీద్, జైషే ఛీప్ మసూద్ అజర్ వంటి వాళ్లకు పాక్ ఆశ్రయం కల్పించకుండా ఉండాలి. అపుడే పరిస్థితులు చక్కబడతాయి’ అని అలైస్ పేర్కొన్నారు. అదే విధంగా కశ్మీర్‌లోని ముస్లింల విషయంలో ఒకలా, చైనాలోని ముస్లింల విషయంలో మరోలా వ్యవహరించడమేమిటని ఆమె పాకిస్తాన్‌ను ప్రశ్నించారు. ‘కశ్మీర్ కంటే చైనాలోని ముస్లింలే నిర్భంధంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాబట్టి పాకిస్తాన్ వాళ్ల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అలైస్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment